పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న ఒబామా కూతురు!

Update: 2016-08-05 12:26 GMT
సాదారణంగా ఒక మోస్తరు రాజకీయ నాయకుడి పిల్లలు జాబ్ చేస్తారా? అది కూడా వేసవి సెలవులు కదా ఖాళీగా ఉండటం ఎందుకు అని పార్ట్ టైం జాబ్ లో చేరతారా? హోటల్ లో పని చేస్తారా? కస్టమర్ల దగ్గర సర్వర్ గా ఆర్డర్లు తీసుకుని అందిస్తారా? ఇండియాలో ఇలాంటివి ఊహించడానికే చాలా కష్టమైన సంగతులు కావొచ్చేమో కానీ.. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా కు అధ్యక్షుడైన బారాక్ ఒబామా చిన్న కూతురు సాషా ఒబామా వేసవి సెలవుల సందర్భంగా పార్ట్ టైం జాబ్ లో చేరింది. వినడానికి ఆశ్చర్యంగా - నమ్మడానికి సందేహంగా ఉన్నా కూడా ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు ఆమె వయసు పదిహనేళ్ళు.. దీనిలో సగం ఏళ్లు వైట్ హౌస్ లోనే లగ్జరీగా గడిపిన పరిస్థితి. అయినా కూడా సాదారణ జీవితానికి కావలసిన మరింత పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ విషయంలో ఎందరికో ఆదర్శప్రాయంగా ఉన్న ఈ సాషా ఒబామాకు మాత్రం తన అక్కే ఆదర్శమేమో అనిపించకమానదు. ఎందుకంటే... గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మీడియా రంగంలో సెటిలవ్వాలనుకున్న ఒబామా పెద్ద కూతురు మలియా ఒబామా.. గతేడాది సమ్మర్ హాలీడేస్ లో మీడియాలో పనిచేయగా.. ఇప్పుడు చెల్లెలు, ఒక రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. బ్లూ షర్ట్ - హ్యాట్ ఖాకీ బ్యాంక్స్ వేసుకొని కస్టమర్ల దగ్గర ఆర్డర్లు తీసుకుంటూ అమెరికా అధ్యక్షుడి చిన్న కూతురు కనిపించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి. ఫ్రైడ్ సీ ఫుడ్ - మిల్క్ షేక్ లకు ఫేమస్ అయిన మార్తాస్ వైన్యార్డ్  లోని ఫుడ్ జెయింట్ నాన్సీ రెస్టారెంట్ లో పార్ట్ టైం ఉద్యోగంలో చేరిన సాషా చేస్తోన్న పని అదే. అవసరం ఉన్నా లేకపోయినా ఇంటిపేరూ - కులం పేరు - తండ్రి పేరు - తాతా పేరు తాజాగా ప్రాంతాల పేర్లు వాడుకుని బ్రతకాలని అనుకునే జనం ఉన్న ఈ రోజుల్లో రెస్టారెంట్ లో పనిచేసేటంతసేపూ తన పేరును నటాషా గా వినియోగిస్తోంది ఈ సాషా ఒబామా.

ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయమేమిటంటే... ఆమె రెస్టారెంట్ లో డ్యూటీ చేసే సమయంలో షిఫ్టుల ప్రకారం ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఆమెకు సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. అయితే ఈ నటాషా అనే అమ్మాయి ఒక సర్వర్ గా పనిచేసుకుంటుంటే.. ఆమెకు తోడుగా ఏకంగా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పనిచేయడమేమిటో ఆ హోటల్ కి వచ్చిన వారికి ముందు అర్ధం కాలేదు. తర్వాత విషయం తెలుసుకుని ముందు ఆశ్చర్యపోయి.. అనంతరం అభినందిస్తున్నారట. స్వతంత్రంగా బ్రతకాలనే ఉద్దేశ్యమో, తమ కాళ్లపై తాము నిలబడాలనుకే ఆత్మాభిమానమో, చెట్టుపేరు చెప్పి కాయలమ్మకూడదనే సిద్దాంతమో ఏమో కానీ.. ఈ విషయంలో వీరంతా కచ్చితంగా ఆదర్శప్రాయులేనేమో!! ఒకసారి ఆలోచించండి!!
Tags:    

Similar News