ఆ మాట చిన్నమ్మకు బాంబులా మారిందట!

Update: 2019-10-22 04:52 GMT
అక్రమాస్తులకు సంబంధించిన కేసులో శిక్ష పడి ప్రస్తుతం పరప్పన అగ్రహాన జైల్లో శిక్షను అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు బాంబులాంటి మాటగా దీన్ని చెప్పాలి. తనకు విధించిన శిక్షా కాలాన్ని.. జైల్లో సత్ప్రవర్తన పేరుతో ముందుగా విడుదలయ్యే అవకాశం ఆమెకు ఏ మాత్రం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది.

తమిళులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దీపావళి పండుగకు కాస్త ముందుగా వెలువడిన ప్రకటన ఆమెకు మింగుడుపడనిదిగా మారతుందని చెప్పక తప్పదు. సత్ప్రవర్తన మీద ఆమె పెట్టుకున్న ఆశలు అడియాసలు కావటమే కాదు.. కోర్టు విధించిన శిక్షా కాలాన్ని పూర్తిగా అనుభవించక తప్పదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా కర్నాటక జైళ్ల శాఖ డైరెక్టర్ మెక్రిక్ మాట్లాడుతూ..ఆదాయానికి మించి ఆస్తులున్నకేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమెకు సత్ప్రవర్తన కారణంగా ముందుగా విడుదల చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. అది తమ పరిధిలోని అంశం కాదని తేల్చి చెప్పిన ఆయన మాటలతో  చిన్నమ్మ వర్గం పెట్టుకున్న ఆశలన్ని అడియాశలుగా మారాయని చెప్పక తప్పదు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేల్చిన కోర్టు విధించిన జైలుశిక్షను అనుభవించేందుకు 2017 ఫిబ్రవరి నుంచి పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. నాలుగేళ్లు శిక్ష విధించిన కోర్టు.. చక్కటి ప్రవర్తనతో ముందే విడుదల కావొచ్చని అనుకున్నా.. అది సాధ్యం కాదని.. పూర్తి కాలం జైల్లోనే ఉండాల్సి ఉంటుందని అంటున్నారు. చిన్నమ్మ జైలుకు వెళ్లి రెండున్నరేళ్లు పూర్తి అయిన వేళ.. ఆమె బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అందుకు భిన్నంగా జైళ్లశాఖ డైరెక్టర్ చెప్పిన మాటతో మరో ఏడాదిన్నర పాటు జైల్లో ఉండక తప్పదంటున్నారు. ఇంతకు మించిన బ్యాడ్ న్యూస్ చిన్నమ్మకు మరేం ఉంటుంది చెప్పండి.
Tags:    

Similar News