అరుదైన కలయిక: పన్నీర్ సెల్వంను పరామర్శించిన శశికళ

Update: 2021-09-01 16:30 GMT
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్త పన్నీర్ సెల్వం ఇంట్లో విషాదం అలుముకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య విజయలక్ష్మి బుధవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బుధవారం ఉదయం హార్ట్ ఎటాక్ రావడంతో ఆస్పత్రికి తరలించగా కన్నుమూశారు.

విజయలక్ష్మీ కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆమెను డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు. ఉదయం 5 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యులు చికిత్స చేసినా లాభం లేకపోయింది. ఉదయం 6.45 గంటలకు ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు.

విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మాజీ సీఎం ఫళని స్వామి, పలువురు మంత్రులు, అన్నాడీఎంకే ముఖ్యులు, ఆస్పత్రికి వెళ్లి పన్నీర్ సెల్వంను పరామర్శించారు. ఆయన సతీమణి మృతి పట్ల సంతాపం తెలిపారు.

పన్నీర్ సెల్వం భార్య మరణవార్త విన్న అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు అయిన శశికళ సైతం ఆస్పత్రికి వచ్చారు. పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ మృతిపట్ల సంతాపం తెలిపారు. అనంతరం ఓపీఎస్ ను పరామర్శించారు. దాదాపు 20 నిమిషాల పాటు శశికళ ఆస్పత్రిలోనే ఉండడం గమనార్హం. ఇన్నాళ్లు విభేదాలతో దూరంగా ఉన్న పన్నీర్ సెల్వం, శశికళ ఈ పరామర్శతో దగ్గరి కావడం విశేషం.
Tags:    

Similar News