అధికార పార్టీలో ఆధిపత్య పోరు..మంత్రి vs ఎమ్మెల్యే!

Update: 2020-02-13 12:00 GMT
రాజకీయాలలో ఆధిపత్య పోరు  - వర్గ పోరు అనేది సర్వసాధారణం. కానీ , ఒక్కొక్కసారి ఈ ఆధిపత్య పోరుతో పార్టీ ప్రతిష్ట కూడా దిగజారే అవకాశం కూడా ఉంది. కొన్ని సార్లు ఈ ఆధిపత్య పోరుని బయటకి పొక్కకుండా పార్టీ పెద్దలు సామరస్యంగా ముగించినప్పటికీ ..కొని కొన్ని సార్లు అనుకోకుండా జరిగిన కొన్ని ఘటనలతో ఈ వ్యవహారం బయటపడుతుంటుంది. ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు అధికార పార్టీ అయిన టిఆర్ ఎస్ లో కూడా జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ - డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్గాల మధ్య కొనసాగుతున్న సహకార పోరు ఆసక్తికర చర్చగా మారింది.

సహకార సంఘం ఎన్నికలు  అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీసింది. నియోజకవర్గంలో  పట్టు కోసం పాకులాడుతున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు వారి అనుచర గణాన్ని బరిలోకి ఒకరికొకరు ఎదురుతగులుతున్నారు. ఇకపోతే మహబూబాబాద్ జిల్లా నుంచి సత్యవతి రాథోడ్‌ కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు.  దీనితో జిల్లాలో  సీనియర్‌ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న రెడ్యా నాయక్‌ కు పదవి దక్కలేదు. దీంతో అప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా సహకార ఎన్నికల్లో కూడా వీరి మధ్య ఫైట్‌ మొదలైంది. కురవి మండలం గుండ్రాతిమడుగు సహకార ఎన్నికల్లో పట్టు కోసం మంత్రి సత్యవతి రాథోడ్ - ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు వర్గాల నుంచి నేతలు ఎన్నికల బరిలోకి దిగారు. పోటాపోటీగా ప్రచారం కూడా మొదలుపెట్టారు. దీనితో ఈ ఎన్నికలు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న రీతిలో జరుగుతున్నాయి.

డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సూచించిన పెద్దలే చక్రం తిప్పుతున్నారు. గుండ్రాతి మడుగు సొసైటీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఒకే పార్టీలో పోటీ కనిపిస్తుండటం విశేషం. మంత్రి సత్యవతి రాథోడ్‌ కు గుండ్రాతిమడుగు సొంత ఊరు . దీంతో ఆమె ముఖ్య అనుచరుడైన కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి తమ వర్గం తరపున అభ్యర్థులను బరిలోకి దింపారు. తమ వర్గం తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాత్రం తమ చైర్మన్ అభ్యర్థిగా గార్లపాటి వెంకట్ రెడ్డిని ప్రకటించి అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపారు. తమ వర్గం గెలిచి మంత్రిపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఒకే పార్టీ నుంచి మంత్రి - ఎమ్మెల్యే వర్గీయులు సహకార ఎన్నికల్లో వేరువేరుగా అభ్యర్థులను బరిలో దించడం ఈ వ్యవహారం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు మూడు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులు. రెండు వర్గాలుగా విడిపోయి ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ - ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు ఒకే పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలలో సత్యవతి రాథోడ్ కు ఉహించని రీతిలో మంత్రి పదవి వరించడంతో రెడ్యానాయక్‌‌ తో పాటు తన వర్గీయులు జీర్ణించుకోలేపోతున్నారు. ఈ విషయం ఇన్ని రోజులు నిమురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికీ తాజాగా సహకార ఎన్నికల్లో ఒక్క సారిగా బయటపడ్డాయి. చూడాలి మరి ఈ ఎన్నికలలో ఎవరు పైచేయి సాధిస్తారో ...
Tags:    

Similar News