బాబు చేరితే మ‌హాకూట‌మి అవుతుందా?

Update: 2018-11-10 08:29 GMT
తెలుగు నాట కొన్ని ప‌త్రిక‌ల‌ను చూస్తే... బాబు లేక‌పోతే దేశం ఏమైపోయేదే అన్న ఆందోళ‌న జ‌నాల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిలో బాబు గురించి హైప్ ఇస్తున్నాయి ఆ ప‌త్రిక‌లు. అయితే, నిశితంగా గ‌మ‌నిస్తే... బాబు చేర‌డం మిన‌హా ఆ కూట‌మిలో కొత్త‌దనం ఏదీ క‌నిపించ‌దు. బాబు త‌నకు మ‌ద్ద‌తు కావాల‌ని వారితో చేరారే గాని బాబు మ‌ద్ద‌తు కోసం వారు ఎదురుచూడ‌టం లేదు.

వారం క్రితం బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యమ‌న్న‌ట్టు ప‌చ్చ మీడియా ఫోజు ఇచ్చింది. నిజానికి  చంద్ర‌బాబు కొత్తగా ఏకం చేసేది ఏమీ లేదు. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు విపరీతంగా చెమ‌టోడుస్తున్నార‌ని చెబుతున్న వారికి ఒక ప్ర‌శ్న ఏంటంటే... ప్ర‌స్తుతం బాబు క‌లిసిన‌ వాళ్లంతా కాంగ్రెస్ అనుకూలురే కదా? మ‌రి కొత్త‌గా బాబు ఎవ‌రిని కూట‌మిలోకి తీసుకువ‌చ్చారు?

జేడీఎస్ ఆల్రెడీ కాంగ్రెస్ తో పొత్తులో ఉంది. స్టాలిన్ కొంతకాలంగా తమిళనాడులో గవర్నర్ పై గుర్రుగా ఉన్నారు. అన్నాడీఎంకే- బీజేపీ ఒకటే అని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అయితే ఫ‌రూక్ అబ్ధుల్లా నుంచి స్టాలిన్ వ‌ర‌కు బాబు క‌లిసి మ‌హా కూట‌మి అని చెబుతున్న వారంద‌రూ ఇప్ప‌టికే కాంగ్రెస్ అనుకూలంగా - బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న‌వారే.  చంద్రబాబు కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఆయ‌న క‌ల‌వ‌డం వ‌ల్ల పేరు ఒక‌టి మార్చారు. మ‌హా కూట‌మి అని. అదేందో బాబు ఉన్న కూట‌మే మ‌హాకూట‌మి అవుతుంది. అదేమైనా బాబు ట్రేడ్‌ మార్క్ ప‌దమా అని జ‌నం సెటైర్లు వేస్తున్నారు. బాబు టీఆర్ ఎస్‌ తో క‌లిస్తే అది మహాకూట‌మి. తెలంగాణ‌లో బాబు కాంగ్రెస్‌ తో క‌లిస్తే అది మ‌హాకూట‌మి. దేశంలో యూపీఏలో బాబు క‌లిస్తే అది మ‌హాకూట‌మి. ఈ స్థాయిలో మీడియా ను మేనేజ్ చేయ‌డం త‌ప్ప బాబు గ‌తంలో గాని, ఇపుడు గాని సాధించింది ఏమీ లేదు.

రాష్ట్రంలో లోటు బ‌డ్జెట్‌ లో ఉన్న రాష్ట్రాన్ని లోటు నుంచి బ‌య‌ట ప‌డేయ‌డానికి బాబు 40 ఇయ‌ర్స్ అనుభ‌వం చాల‌లేదు.  కేవలం రాష్ట్రంలో తన వైఫ‌ల్యాల‌ను కప్పిపుచ్చుకోవడానికి ఇది బాబు వేసిన ఎత్తుగ‌డ‌. ప్రజలను జాతీయ రాజకీయాల వైపు మళ్లించి హ‌డావుడి చేస్తే... రాష్ట్రంలో అవినీతి పాపాల‌న్నీ ప్ర‌జ‌లు మ‌రిచిపోతారేమో అని ఆశ‌. త‌న మీద జ‌నంలోని కోపాన్ని బీజేపీ మీద మ‌ళ్లించ‌డం ద్వారా చాలా చాక‌చ‌క్యంగా బాబు త‌ప్పించుకుంటున్నారు. .
   

Tags:    

Similar News