సీఏఏ మీద తొలిసారి పెదవి విప్పిన సత్య నాదెళ్ల

Update: 2020-01-14 06:11 GMT
తానేం టచ్ చేసినా బంగారమైపోతుందన్న ఇమేజ్ ఉన్న ప్రధాని మోడీకి తొలిసారి సీఏఏ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉంచిన సున్నితమైన.. వివాదాస్పద అంశాల్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున తెర మీదకు తీసుకొచ్చి తేల్చేసిన తీరుకు చాలామంది విస్మయానికి గురయ్యారు. ఇంత సాహసమా? అంటూ షాక్ తిన్నోళ్లు లేకపోలేదు. ఈ ఇష్యూలో మోడీకి ఇబ్బంది తప్పదని అంచనాలన్ని తప్పు కాగా.. ఎవరూ ఊహించని రీతిలో సీఏఏ ఇష్యూలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా చెప్పక తప్పదు.

ఈ అంశం మీద దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు.. నిరసనలు చూస్తే.. సీఏఏ విషయంలో సరైన కసరత్తు చేయటంలో మోడీ పరివారం ఫెయిల్ అయ్యిందని చెప్పక తప్పదు. ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు సైతం సీఏఏను వ్యతిరేకించటం.. విమర్శించటం చూస్తే.. తాము తీసుకొచ్చిన చట్టంపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న సందేహం కలుగక మానదు.

ఇదిలా ఉంటే.. తాజాగా పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. తొలిసారి ఆయనీ అంశంపై పెదవి విప్పారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు విచారకరమని.. అదేమీ మంచిది కాదన్నారు.

భారత్ కు వచ్చే బంగ్లాదేశ్ వలసదారుడు ఇన్ఫోసిస్ తదుపరి సీఈవో అయితే చూడాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అమెరికన్ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సీఏఏ.. దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలపై సత్య నాదెళ్ల మాట్లాడారా? అన్న సందేహానికి సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. చట్టబద్ధమైన వలస విధానం గురించి మాత్రమే సత్య నాదెళ్ల మాట్లాడి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏమైనా.. ప్రస్తుతం జరుగుతున్నది విచారకరం.. మంచిది కాదన్న రెండు మాటల్ని అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News