అర్థ‌రాత్రి వేళ కూట‌మి సీట్ల లెక్క ఫైన‌ల్‌.?

Update: 2018-10-28 04:53 GMT
తెలుగు టీవీ సీరియ‌ల్ మాదిరి ఎంత‌కూ ముగింపు రాని రీతిలో మ‌హాకూట‌మి పార్టీ పొత్తు లెక్క‌లు తాజాగా ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. అస‌లు పొత్తు ఉంటుందా.  ఉందా?  కూట‌మిలో ఎన్ని పార్టీలు ఉంటాయి? ఇలాంటి సందేహాల మ‌ధ్య శ‌నివారం అర్థ‌రాత్రి వేళ‌.. కూట‌మి సీట్ల లెక్క ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

కూట‌మి భాగ‌స్వామ్యులంతా కూడా పోటీ చేసే సీట్ల కంటే కూడా.. గెలుపు ముఖ్య‌మ‌న్న ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌టం ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ సైతం గ‌తంలో మాదిరి కాకుండా ప‌ట్టువిడుద‌లను ప్ర‌ద‌ర్శిస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మొద‌ట్నించి వంద సీట్ల వ‌ర‌కూ కోరుకున్న కాంగ్రెస్‌.. చివ‌ర‌కు 91 సీట్ల‌కు ప‌రిమిత‌మైంది. కాంగ్రెస్ సీట్ల‌లో మ‌రింత కోత పెట్టాల‌ని కూట‌మిలోని పార్టీలు ప్ర‌య‌త్నించినా.. అందుకు కాంగ్రెస్ నో చెప్పింది. విప‌రీత‌మైన త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. ఏ పార్టీ ఎన్ని సీట్ల‌లో పోటీ చేయాల‌న్న లెక్క‌ను తేల్చారు.

కూట‌మిలో ప్ర‌ధాన ప‌క్ష‌మైన కాంగ్రెస్ 91 స్థానాల్లో కోదండం మాష్టారి తెలంగాణ జ‌న‌స‌మితి 9 స్థానాల‌కు ఓకే చెప్ప‌గా.. టీడీపీ 15 సీట్ల‌లో పోటీ చేయ‌నుంది. ఇక‌.. సీపీఐ ఐదు స్థానాల‌కు ప‌రిమితం కానుంది. కూట‌మిలోని పార్టీల‌న్నీ కూడా గెలుపే ల‌క్ష్యంగా ఉండాలే త‌ప్పించి.. మ‌రిక వేటికి ప్రాధాన్య‌త ఇవ్వొద్ద‌న్న మాట మీద ఉండాల‌ని నిర్ణ‌యించారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. మోడీ తీరును క‌డిగి పారేసేందుకుఢిల్లీకి వెళుతున్న‌ట్లు చెప్పిన చంద్ర‌బాబు.. ప్రెస్ మీట్లుపెట్టేసి మోడీని తీవ్రంగా టార్గెట్ చేసిన ఆయ‌న‌.. ప‌నిలో ప‌నిగా ఢిల్లీకి తాను వ‌చ్చిన సీట్ల స‌ర్దుబాటు ప‌నిని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

శ‌నివారం అర్థ‌రాత్రి వ‌ర‌కూ ఢిల్లీలో బాబు నేతృత్వంలోని పార్టీ నేత‌లు కాంగ్రెస్ తో భేటీ అయి.. పోటీ విష‌యంలో మ‌రింత క్లారిటీ తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. పోటీ చేసే స్థానాల‌కు సంబంధించి పంతాల‌కు పోయే క‌న్నా.. గెలుపు మీద‌నే ఎక్కువ‌గా దృష్టి సారించాల‌ని నిర్ణ‌యించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న అంశంపై క్లారిటీ వ‌చ్చినా.. ఏయే సీట్ల‌లో ఎవ‌రెవ‌రు పోటీ చేయాల‌న్న అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు. రానున్న రోజుల్లో ఆ అంశం మీద కూడా క‌స‌ర‌త్తు చేసి.. తుది జాబితాను సిద్ధం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌.. టీడీపీల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉన్న‌ట్లు చెబుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించిన ఎల్ బీన‌గ‌ర్‌..కుత్బుల్లాపూర్‌.. జూబ్లీహిల్స్.. స‌న‌త్ న‌గ‌ర్  స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ బ‌రిలోకి దిగాల‌ని భావించ‌టం.. తాము గెలిచిన స్థానాల్ని త‌మ‌కు విడిచి పెట్టాల‌ని బాబు అడుగుతున్న‌ట్లు చెబుతున్నారు. ఇదే విష‌యం రెండు పార్టీల మ‌ధ్య పెద్ద ఇష్యూగా మారిన‌ట్లు చెబుతున్నారు. దీనిపై తుది ద‌శ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. మ‌రో నాలుగైదు రోజుల్లో లెక్క తేలిపోతుంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News