బాల‌య్య‌ ప‌ల్లె నిద్ర వెనుక సీక్రెట్ అదేన‌ట‌!

Update: 2018-07-04 08:02 GMT
సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌.. రాజ‌కీయాల్లో మాత్రం వేయ‌లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది. రాజ‌కీయాల‌తో నేరుగా సంబంధం ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ ఎంట్రీకి ఆచితూచి అన్న‌ట్లుగా వెయిట్ చేసి.. 2014లో బ‌రిలోకి దిగిన ఆయ‌న త‌న తండ్రి గ‌తంలో పోటీ చేసిన అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. క‌ర్ణాట‌క‌ స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా ఉండే హిందూపురం ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఎన్టీఆర్ ను బంప‌ర్ మెజార్టీతో గెలిపించ‌ట‌మే కాదు.. ఆగ్ర‌హం వ‌చ్చిన‌ప్పుడు తిర‌స్క‌రించిన ఘ‌న చరిత్ర ఉంది.

మ‌రి.. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బాల‌య్య పోటీకి దిగటం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టం.. విభ‌జ‌న తాలుకూ గాయాలు ప‌చ్చిగా ఉన్న ద‌శ‌లో బ‌రిలోకి దిగిన బాల‌య్య‌ను హిందూపురం ప్ర‌జ‌లు అక్కున చేర్చుకున్నారు. స్వ‌యాన ముఖ్య‌మంత్రి బావ‌మ‌రిది క‌మ్ వియ్యంకుడే త‌మ ఎమ్మెల్యే కావ‌టంతో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఎక్క‌డికో వెళుతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

దీనికి తోడు సినిమా స్టార్ త‌మ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హించ‌టంతో గ్లామ‌ర్ వ‌స్తుంద‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని బాల‌య్య ప‌రిష్క‌రించే అంశంపై అక్క‌డి ప్ర‌జ‌లు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే.. వాస్త‌వం అందుకు భిన్నంగా మార‌టంతో హిందూపురం ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైంది. పేరుకు బాల‌య్య త‌మ ఎమ్మెల్యే అయినా.. మిగిలిన ఎమ్మెల్యేల‌తో పోలిస్తే.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి రాక‌పోవ‌టం.. వ‌చ్చినా మూడు నెల‌ల‌కో.. ఆర్నెల్ల‌కో ఒక‌సారి ముఖం చూపించి వెళ్ల‌టంతో హిందూపురం వాసులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రోవైపు త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పెద్ద స్థాయిలో ఉన్న నేత‌ల‌తో స‌మావేశ‌మై వెళ్లిపోయేవారు.

కింది స్థాయి నేత‌ల‌తోనూ.. ప్ర‌జ‌ల‌తోనూనేరుగా సంబంధాలు లేవు. ఈ నేప‌థ్యంలో ఉన్న‌త స్థాయిలో ఉన్న నేత‌ల హ‌డావుడి అంత‌కంత‌కు పెరిగిపోతున్న ప‌రిస్థితి. ఇదిలానే కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌య్య‌కు ఎదురుగాలి త‌ప్ప‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డనున్న వేళ‌.. త‌న తీరునుపూర్తిగా మార్చేశారు బాల‌య్య‌.

గ‌తంలో వ‌రుస పెట్టి షూటింగ్ మీద దృష్టి పెట్టిన ఆయ‌న‌.. గ‌డిచిన కొద్ది రోజులుగా పల్లె నిద్ర పేరుతో భారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం మీద ఆయ‌న పూర్తి ఫోక‌స్ పెట్టారు.

బాల‌కృష్ణ‌కు కోపం ఎక్కువ‌ని.. ఆయ‌న అంద‌రితో క‌ల‌వ‌ర‌ని.. త‌న‌ను తాను గొప్ప‌వాడిగా ఫీల‌వుతుంటార‌ని.. అంటీ ముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న చెడ్డ‌పేరును తొల‌గించే ప్ర‌య‌త్నంచేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక పెద్దావిడ‌కు తానే భోజ‌నం తినిపించ‌టం.. ద‌ళిత వాడ‌లో స‌హ‌పంక్తి భోజ‌నం చేయ‌టం.. సామాన్యుల ఇళ్ల‌ల్లోనే నిద్ర పోవ‌టం.. లాంటివి చేయ‌టం ఒక ఎత్తు అయితే.. త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పెద్ద నేత‌ల్ని వ‌దిలి  ఏ ప్రాంతానికి చెందిన నాయ‌కుల్ని ఆ  ప్రాంతానికి తీసుకెళ్ల‌టం.. వారితో క‌లిసి అక్క‌డి స్థానికుల‌తో  మాట్లాడుతున్నారు. వారు ఎదుర్కొంటున్న‌ స‌మ‌స్య‌ల్ని సావ‌ధానంగా వింటున్నారు.  

త‌న మార్క్ గా విమ‌ర్శ‌ల‌కులు ఎత్తి చూపించే కోపాన్ని ప‌క్క‌న పెట్టేసిన బాల‌య్య అంద‌రితో క‌ల‌విడిగా ఉంటున్నారు. బాల‌య్య‌లో వ‌చ్చిన మార్పును చూసిన స్థానిక ప్ర‌జ‌లు సైతం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  నాలుగేళ్లుగా షూటింగ్ ల పేరు చెప్పి బిజీగా ఉండి.. నియోజ‌క‌వ‌ర్గాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని బాల‌య్య ఇప్పుడు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ధోర‌ణి చూస్తే.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News