సీమాంధ్ర పాలకుల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు

Update: 2016-06-08 03:42 GMT
సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర పాలకులు అంటూ తెలంగాణ ఉద్యమనేతలు పలువురు తీవ్ర విమర్శలు చేసేవారు. పనిలో పనిగా వ్యక్తిగత విమర్శలు కూడా చేసేవారు. సీమాంధ్ర ప్రభుత్వం అంటూ వేలెత్తి చూపిస్తూ.. ఒకరి పెత్తనం కింద తాము ఎందుకు బతకాలంటూ తరచూ ప్రశ్నించేవారు. తమదైన ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే.. తమకు అవమానాలు ఉండవన్న వాదనలు చేసినోళ్లు చాలామందే ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఫలంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా సీమాంధ్ర పాలకుల గురించి.. వారి మాటల గురించి తెలంగాణవాదులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయటం.. దానికి ప్రతిగా టీఆర్ ఎస్ ముఖ్యనేతలంతా ఒక్కసారిగా మాటలదాడి చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా కోదండరాం మీద టీఆర్ ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు చాలావరకూ షాకింగ్ గా మారాయి. తెలంగాణ ఉద్యమంలో స్వార్థం అన్నది లేకుండా పని చేసి.. తన ఆస్తుల్ని పెద్ద ఎత్తున కోల్పోయినప్పటికీ.. అధికారాన్ని.. పదవుల్ని చేపట్టేందుకు ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయని కోదండరాంను అన్నేసి మాటలు ఎలా అంటారన్నది ఒక ప్రశ్నగా మారింది. ఈ సందర్భంగా కొందరు నేతలు.. ఉద్యమకారులు సీమాంద్ర పాలకుల్ని.. ఉద్యమ సమయంలో సీమాంధ్రులు వ్యవహరించిన తీరును గుర్తు తెచ్చుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర పాలకులు సైతం కోదండరాంను గౌరవంగా చూశారని.. ఆయన్ను అన్నేసి మాటలు అనలేదంటూ పలువురు నేతలు గుర్తు చేసుకోవటం గమనార్హం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయటాన్ని కాస్త అర్థం చేసుకోవచ్చు. కానీ.. బచావో తెలంగాణ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు సైతం.. సీమాంధ్ర పాలకుల గురించి.. ఉద్యమ సమయంలో వారు కోదండరాంతో వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. కోదండం మాష్టారి పట్ల గౌరవంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడి విషయంలో తెలంగాణ పాలకుల తీరు కంటే సీమాంద్ర పాలకులే గౌరవంగా చూశారని వ్యాఖ్యానించటం విశేషంగా చెప్పాలి.
Tags:    

Similar News