రచ్చ: కమలా హారిస్ పేరు పలకలేని సెనెటర్

Update: 2020-10-18 15:30 GMT
అమెరికా ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార రిపబ్లిక్, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రచారం ఉవ్వెత్తున సాగుతోంది. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుఫున ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్నారు భారత సంతతికి చెందిన కమలా హారిస్. ఈ క్రమంలోనే ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. తాజాగా కమలా హారిస్ పేరును రిపబ్లికన్ సెనెటర్ ఒకరు సరిగా పలకలేక నానా అవస్థ పడ్డాడు.

జార్జియాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న డేవిడ్ ఫెర్ద్యూ అనే సెనెటర్.. కమలా హారిస్ పేరును పలకబోయి ‘కహ్ మహ్ లా’ అని .. ‘కమలా.. మాలా మాలా’ అని రకరకాలుగా వ్యాఖ్యానించాడు. ‘అసలు ఆమె పేరు విషయం నాకేం తెలియదు.. ఇదేం పేరో’ అని వ్యంగ్యంగా జాతివిద్వేశ వ్యాఖ్యలు చేశాడు.

ఈ వ్యాఖ్యలతో కమలాహారిస్ మద్దతుదారులకు అతడిపై చిర్రెత్తుకొచ్చింది. ‘మైనేమ్ ఈజ్’ అని.. ‘ఐస్టాండ్ విత్ యూ’ అని హ్యాష్ ట్యాగ్ లతో ఆన్ లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ ఘటనపై కమలా హారిస్ ప్రతినిధి సబ్రినా స్పందించారు. నువ్వు మాజీ సెనెటర్ అయ్యాక.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అని తప్పనిసరిగా పిలుస్తావు అంటూ కౌంటర్ ఇచ్చారు. జార్జియా నుంచి ప్రస్తుతం డేవిడ్ ఫెర్ద్యూ ఎంపీగా మళ్లీ పోటీచేయబోతున్నారు.




Tags:    

Similar News