చంద్రబాబుపై పీకల్దాకా కోపం

Update: 2017-04-03 06:05 GMT
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తెలుగుదేశం పార్టీలో అలకలు, అసంతృప్తికి దారితీసింది. సీనియర్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నుంచి జూనియర్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వరకూ అందరూ రాజీనామా అస్త్రాలు..  బహిరంగ నిరసనలతో చంద్రబాబుకు షాకిచ్చారు.  మంత్రివర్గ ప్రమాణస్వీకారం ముగిసిన కొద్దిసేపటికే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అసంతృప్తి భగ్గుమంది. దీంతో అప్రమత్తమైన బాబు సీనియర్ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి - గంటా శ్రీనివాస్ - అచ్చెన్నాయుడు... ఎంపీ సీఎం రమేశ్ లను రంగంలోకి దించి బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు.  అయితే... పలువురు నేతలు బుజ్జగింపులతో మెత్తబడినా అప్పటికే వారు చేసిన వ్యాఖ్యలు మాత్రం స్ప్రెడ్ అయ్యాయి.
    
మంత్రి పదవి ఆశించి భంగపడిన... పదవి పోవడంవల్ల ఆగ్రహించిన.. తమ ప్రత్యర్థులకు పదవి ఇచ్చారని మండిపడిన పలువురు నేతలు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఎవరేమన్నారో మీరే చూడండి..

* ఎమ్మెల్యేగా అయినా పనికొస్తానా?: బొజ్జల

మంత్రి పదవి కోల్పోయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి  తీవ్ర మనస్తాపంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాకు ఆరోగ్యం బాగోలేని మాట నిజం. అయితే నేనేమీ నడవలేని దుస్థితిలో లేనే. చికిత్స తీసుకుంటున్నా. అనారోగ్య కారణాలతో మంత్రి పదవికి పనికిరాకపోతే మరి ఎమ్మెల్యేగా ఎలా పనికొస్తా? అందుకే రాజీనామా చేశా. అలిపిరి దాడిలో బాబుతో పాటు నేనూ గాయపడ్డా. తర్వాత హార్ట్‌ఎటాక్, కేన్సర్ వచ్చాయి. చికిత్స తీసుకుంటున్నా’’ అన్నారు.

* నేను చేసిన తప్పేంటి?: పల్లె రఘునాథరెడ్డి

‘నేను మిగిలిన వారిలా భూకబ్జాలు, ఇసుక అమ్మకాలు, ముఠాలు కట్టానా? నా కొడుకేమైనా జోక్యం చేసుకున్నాడా? నాకు సరైన అధికారులనివ్వకుండా పనితీరు బాగోలేదంటే ఎలా? నాకు రాజకీయాలేమీ వృత్తికాదు. కాలేజీలు నమ్ముకుంటే ఎంతో సంపాదించుకునేవాడిని. ఇప్పుడు నేను జిల్లాలో సొంత సామాజికవర్గంలో మొహం ఎలా చూపించాలి? నాకు చీఫ్ విప్ కూడా వద్దు. నేను రాజీనామా చేస్తా’ అని చంద్రబాబుతోనే చెప్పారు.

* ఆయారాం.. గయారాంల కోసమా అన్న పార్టీ పెట్టింది: గోరంట్ల

పార్టీ ఫిరాయింపుదార్లకు మంత్రి పదవి ఇచ్చి, పార్టీ కోసం పనిచేస్తున్న వారిని విస్మరించినందుకు నిరసనగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తన అసమ్మతిని మీడియా ముందే వెల్లడించారు. ‘అన్నగారు పార్టీ పెట్టింది ఇలాంటి వారికోసమేనా?  టిడిపి ఆయారాం- గయారాంలకు కేంద్రంగా మారింది’ అంటూ నేరుగా చంద్రబాబుకు లేఖ రాశారు.

* గౌడగా పుడితే ఇంతేనా?: కాగిత వెంకట్రావు

‘నేను గౌడలో పుట్టినందుకే నాకు మంత్రి పదవి ఇవ్వలేదేమో? టిడిపిలో ఒక బీసీ నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా? బీసీ నేతను ఇంతగా అవమానిస్తారనుకోలేద’ని కృష్ణా జిల్లా పెడన సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు నిలదీశారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి నిరసనగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. సోమవారం పెడన బందుకు పిలుపునిచ్చి సంచలనం సృష్టించారు.

* టీడీపీ ఎందుకు.. నేనే కొత్త పార్టీ పెడతా: చింతమనేని

‘పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి, కేసులు ఎదుర్కొన్నందుకు ఇదా ఫలితం?  అవసరమైతే నేనే కొత్త పార్టీ పెడతా’ అని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చంద్రబాబుపై మండిపడ్డారు.  తర్వాత అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఇంటికి వెళ్లి మరీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందించారు.  విప్ పదవికీ రాజీనామా చేశారు.

* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిందంతా మర్చిపోయారు: ధూళిపాళ్ల

‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినదంతా పార్టీ మర్చిపోవడం దారుణమన్నారు. తనను పిలిచి ఇవ్వడం లేదని చెప్పినా సరిపోయేదన్నారు. పార్టీ మారిన వాళ్లకు ఉన్న విలువ నాకు లేదు’’

* చంద్రబాబు మోసం చేశారు: మోదుగుల

‘‘ఎంపీగా ఉన్న నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. కన్నా లక్ష్మీనారాయణను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారు. పార్టీలు మారిన వాళ్లకు, నాలుగుసార్లు ఓడిన వారికి మంత్రి పదవికి ఇచ్చారు’’

* ఆరుసార్లు గెలిస్తే అది సీనియారిటీ కాదా: శివాజీ

‘‘ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన నన్ను కరుణించలేదు.  పనిచేసే వారికి గుర్తింపులేకుండా పోయింది.’’

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News