టెన్త్ ర్యాంకులు ప్రకటిస్తే జైలుకే.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!

Update: 2022-06-02 07:34 GMT
ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ విద్యా సంస్థలకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో వెలువడనున్న పదో తరగతి ఫలితాలకు సంబంధించి ర్యాంకులను ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ర్యాంకులు ప్రకటించిన కార్పొరేట్ విద్యా సంస్థలకు కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా చేస్తామని జగన్ ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తామని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీ చైతన్య, నారాయణ, కేకేఆర్ గౌతమ్స్, నెల్లూరు రవీంద్రభారతి, విజయవాడ రవీంద్ర భారతి తదితర కార్పొరేట్ విద్యా సంస్థలకు బిక్ షాక్ తగిలింది.

ఏటా పదో తరగతి ఫలితాలప్పుడు ఆయా కార్పొరేట్ విద్యా సంస్థలు.. ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు టీవీ చానెళ్లు, పత్రికల్లో భారీ స్థాయిలో కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలు ఇస్తున్నాయి. ఫలితాలు వెలువడ్డాక వారాల తరబడి ఈ తంతు కొనసాగుతోంది. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రోహిత్ శర్మ వంటి వారిని కూడా తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని భారీగా యాడ్లు ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మోసపూరిత ప్రకటనలపై జగన్ సర్కార్ కన్నెర్ర జేసింది. తమకే ఎక్కువ ర్యాంకులంటూ ప్రకటనలు ఇస్తే జైలుశిక్షలు తప్పవని హెచ్చరించింది. దీంతో ఆయా కార్పొరేట్ విద్యా సంస్థల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. వాస్తవానికి ఆయా విద్యాసంస్థల్లో చదివే పదో తరగతి విద్యార్థులు లక్షల్లో ఉంటారు. కానీ ర్యాంకులు మాత్రం వందల్లోనే ఉంటున్నాయి. అయినా సరే తమకే ఎక్కువ ర్యాంకులు వచ్చాయంటూ ఆయా విద్యా సంస్థలు మీడియాలో మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఫస్టు ర్యాంకు వచ్చిన విద్యార్థి తమ విద్యా సంస్థలో చదివాడంటే.. తమ విద్యా సంస్థలో చదివాడని ఒకే విద్యార్థి కోసం వాదులాడుకుంటున్నాయి.

ఇలా మోసపూరిత ప్రకటనల రూపంలో యాడ్సు ఇస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలపై మోజును కలిగేలా చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఫీజు, ఈ ఫీజు అంటూ ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలనుకునే తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు.

పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు వేలల్లో ర్యాంకులు సాధించారని ప్రకటించుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల కోసమే ఇలా చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణులు కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం పదో తరగతి ర్యాంకుల ప్రకటనపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘించి పదో తరగతి ర్యాంకులు ప్రకటించినా, టీవీల్లో, పత్రికల్లో ప్రకటనలు జారీ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందుకు బాధ్యులైన వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్షలు విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే లక్ష రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

దీంతో ఇకపై ర్యాంకుల ప్రకటనలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో టీవీలు చూసే ప్రేక్షకులకు కూడా ఊరట దక్కనుంది. ఇక టీవీల్లో ఆయా విద్యా సంస్థల నుంచి వెల్లువత్తే "ఒకటి.. ఒకటి.. రెండు.. మూడు.. మూడు, ఐదు" అంటూ ఇలా సాగుతూ టీవీ చూసేవారికి చుక్కలు చూపించే ర్యాంకుల ప్రకటనకు బ్రేక్ పడనుంది. టీవీలు చూసే వారు ఇక మనశ్శాంతిగా చూసే అవకాశం కలగనుంది.
Tags:    

Similar News