రాహుల్ ప్ర‌ధాని కావాలి..బీజేపీ ఎంపీ కోరిక‌

Update: 2018-05-13 08:14 GMT
ఇంటిపోరు అంటే ఎలా ఉంటుందో...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఓ రేంజ్‌లో తెలిసివ‌స్తున్న‌ట్లుంది. బీజేపీలో ఎదురులేని నేత‌గా ఎదిగి...పార్టీ సీనియ‌ర్ల‌ను సైతం విజ‌య‌వంతంగా ప‌క్క‌కు పెట్టిన్ప‌టికీ ఆయ‌నకు అసంతృప్త నేత‌ల‌తో చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. పార్టీలో స‌ర్వం తానే అయిన మోడీకి ఇంటిపోరు త‌ప్ప‌డం లేదని వివ‌రిస్తున్నారు. ప‌క్క‌లో బ‌ల్లెంలాగా మారిన  బీజేపీ పార్టీ నాయకుడు శత్రుఘ్న సిన్హా మ‌రోమారు మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రధాని కావాలనుకుంటున్నానని వెల్లడించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని పరిహసిస్తూ.. వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోడీని విమర్శించడం తెలిసిన సంగ‌తే. దీనిపై కాంగ్రెస్ మండిప‌డింది కూడా. అయితే గ‌తంలో సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా  ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలిచి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఒక జాతీయ పార్టీ, చారిత్రక నేపథ్యం ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ప్రధాని కావాలనుకోవడంలో తప్పేముందని శత్రుఘ్న సిన్హా  ప్రశ్నించారు. ఒకవేళ రాహుల్ వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షిస్తే అందుకు శుభాకాంక్షలు తెలపాలి అంటూ మోడీకి మంట‌పుట్టించే కామెంట్లు చేశారు.

కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే తానే ప్రధానిని అవుతానేమో అని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం... దానికి ప్రధాని మోడీ కౌంటర్ ఇవ్వడం తెలిసిన సంగ‌తే. దీనికి స్పందించిన శత్రుఘ్న సిన్హా...మోడీ విమర్శలపై అసంతృప్తి వ్యక్తం చేశారు! రాహుల్‌ గాంధీ అన్నదాంట్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు!! ``ఎవరైనా కలలు కనొచ్చు... వాటిని సాకారం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేయొచ్చు... ప్రధాని కావడానికి ఎలాంటి అర్హత, ప్రత్యేక జ్ఞానం అక్కర్లేదు` అని మోడీని ఎత్తిపొడిచే కామెంట్లు చేశారు. సంఖ్యాబలం, మద్దతు ఉంటే, కార్మికుడు - కర్షకుడు - సామాన్యుడు, గొప్పవాడు అనే తేడా లేకుండా దేశంలో ఎవరైనా ప్రధాని కావొచ్చని పేర్కొన్న ఆయన... మనం అందరం దాని గురించి ఏడ్వాల్సిన పని ఏముందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొన్నేళ్ల నుంచి పరిపక్వమయ్యారని, ప్రస్తుతం కీలకమైన ప్రశ్నలు సంధిస్తున్నారని వివరించారు. నీరవ్‌ మోడీ - లలిత్‌ మోడీ - బ్యాంకుల - రాఫెల్‌ ఒప్పందంలాంటి పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, కానీ బీజేపీ వాటిని తిరస్కరించడమో లేదా ఉపేక్షించడమో చేస్తున్నదని పేర్కొన్నారు.

ఇంత‌టితోనే ఆపేయ‌కుండా ప్రధానిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు శ‌త్రుఘ్న‌సిన్హా. 130 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి ఒక జాతీయ పార్టీని ఉద్దేశించిన ఎన్నికల్లో ఇలా వ్యాఖ్యానించడం సరైనది కాదన్నారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారులకు పదాల నిర్వచనం చెప్పే విధంగా ఉందంటూ సెటైర్లు వేసిన శత్రుఘ్న సిన్హా  ... సర్‌! దేశం ఏమీ స్కూల్ కాదంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక ప్రధాని 'పీపీపీ' అంటూ చేసిన వ్యాఖ్యలు చిల్లర రాజకీయాలను తలపిస్తున్నాయని... ప్రధాని ప్రతిష్టను దిగజారుస్తాయని ఆయన మండిపడ్డారు.
Tags:    

Similar News