బీజేపీ నా పార్టీ.. లాలూ నా కుటుంబం

Update: 2018-06-15 14:01 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఇంటిపోరు అంటే ఎలా ఉంటుందో...ఓ రేంజ్‌లో తెలిసివ‌స్తున్న‌ట్లుంది. పార్టీలో స‌ర్వం తానే అయిన మోడీకి ఇంటిపోరు త‌ప్ప‌డం లేదని వివ‌రిస్తున్నారు. బీజేపీలో ఎదురులేని నేత‌గా ఎదిగి...పార్టీ సీనియ‌ర్ల‌ను సైతం విజ‌య‌వంతంగా ప‌క్క‌కు పెట్టిన్ప‌టికీ ఆయ‌నకు అసంతృప్త నేత‌ల‌తో చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ప‌క్క‌లో బ‌ల్లెంలాగా మారిన  బీజేపీ పార్టీ నాయకుడు శత్రుఘ్న సిన్హా మ‌రోమారు మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌తంలో సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా  ఇటీవ‌లి కాలంలో ప్ర‌ధానిపై దూకుడుగా విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా సిన్హా క‌ల‌క‌లం సృష్టించే కామెంట్లు చేశారు. బీజేపీ తన పార్టీ కావచ్చు కానీ.. లాలూ ప్రసాద్‌ తన కుటుంబమని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న సిన్హా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్‌, రబ్రీదేవి, తేజస్వీ, తేజ్‌, మిసా... తనకు కుటుంబ స్నేహితులని, వారి ఆహ్వానం మేరకు ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యానని తెలిపారు. బీజేపీ తన పార్టీ కావచ్చేమో కానీ వారందరూ తన కుటుంబ సభ్యులని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో సిన్హా తరచుగా ఆర్జేడీ కార్యక్రమాల్లో పాల్గొనడం, బీజేపీ నాయకత్వాన్ని, దాని నిర్ణయాలను బహిరంగంగానే విమర్శించడం, లాలూ ప్రసాద్‌ను తన స్నేహితుడిగా అభివర్ణించడంతో సిన్హా ఆర్జేడీలో చేరుతారని వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని, మరే పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. కాగా ఎన్నో ఏళ్ల‌ నుంచి బీజేపీ కోసం సిన్హా ఎంతో కృషి చేసినప్పటికీ ఆ పార్టీ ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని లాలూ తనయుడు తేజస్వీ ప్రసాద్‌ అన్నారు. సిన్హా తమ పార్టీలో చేరబోతున్నారా అనే అంశం ప్రస్తావించగా... అటువంటి గొప్ప నాయకుడు తమ పార్టీలో చేరాలని ఎవరికైనా ఉంటుందని, కానీ తుది నిర్ణయం ఆయనదేనని తేజస్వీ బదులిచ్చారు. కాగా, సిన్హాపై చ‌ర్య‌లు తీసుకునేందుకు పార్టీ వెన‌క‌డుగు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News