ఢిల్లీ ఎయిర్ పోర్టులో సుజనా చౌదరికి షాక్

Update: 2020-11-13 17:00 GMT
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పాల్పడ్డ విషయం తెలిసిందే. 2018 అక్టోబర్‌ 26వ తేదీన రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై సుజనా చౌదరి సంస్థ సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రుణంగా తీసుకుంది. ఫిబ్రవరి 20, 2020 నాటికి ఆ రుణం వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరింది. ఆ మొత్తం తిరిగి చెల్లించాలన్న నోటీసులకు సుజనా చౌదరి స్పందించలేదు. దీంతో, సుజనాకు చెందిన ఫెరారీ, బెంజ్ కార్లను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరిలో సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు సైతం నిర్వహించింది. ఆ తర్వాత సుజనాపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. ఈ నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు లెక్కచేయకుండా
అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు.

సుజనాపై లుక్‌ అవుట్‌ నోటీసులున్నాయని, అందుకే దేశం విడిచి వెళ్లేందుకు వీల్లేదని ఇమిగ్రేషన్‌ అధికారులు నిలిపివేశారు. అయితే, తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్‌ఔట్‌ నోటీసులు రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఇప్పటికే సుజనాపై హైకోర్టులో మారిషస్‌ బ్యాంకులు పిటిషన్‌ దాఖలు చేశాయి. దీంతోపాటు, షెల్‌ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలను కూడా సుజనా చౌదరి ఎదుర్కొంటున్నారు. మరోవైపు, సుజనా గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. కానీ, సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని, అటువంటపుడు ఇన్ని వేల కోట్ల రుణం ఎలా వచ్చిందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబుకు సుజనా అత్యంత సన్నిహితుడని, అందుకే ఆ రుణాలు వచ్చాయని సుజనా పై ఆరోపణలున్నాయి. చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి 2014లో రాజధానిపై ప్రకటన వెలువడక ముందే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. బ్యాంకుల ద్వారా వచ్చిన రుణాల సొమ్ముతోనే సుజనా ఆస్తులను పోగేసుకున్నారనే ఆరోపణలు గతంలో వచ్చాయి.


Tags:    

Similar News