షాకింగ్ లాఠీఛార్జి.. రైతుల తలలు పగలకొట్టాలంటూ ఉన్నతాధికారి హుకుం.. ఎక్కడంటే?

Update: 2021-08-29 08:11 GMT
ఇప్పటికే మోడీ సర్కారు మాట విన్నంతనే పంజాబ్ లోని రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై వారు లేవనెత్తిన అభ్యంతరాలు.. వాటిని వెంటనే ఎత్తేయాలని కోరుతూ నిర్వహించిన ఆందోళన మోడీ సర్కారుకు ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆగ్రహావేశాల కారణంగా పంజాబ్లో ఇప్పుడా పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం పంజాబ్ లోనే కాదు.. పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రంలోని బీజేపీ సర్కారుకు భారీ షాక్ ఇవ్వటమే కాదు.. బీజేపీకి రైతులు పూర్తిగా దూరం కానున్నారని చెప్పక తప్పదు.

రైతులు నిర్వహించిన ఆందోళనపై హర్యానా పోలీసులు ప్రదర్శించిన అతి.. బీజేపీకి భారీ డ్యామేజ్ కలుగజేయనుందని.. రానున్న రోజుల్లో దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఒక పోలీసు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై అన్నదాతలు కోపంగా ఉన్నారు. సాగు చట్టాలపై తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం.. వారిని కంట్రోల్ చేయాలన్న పేరుతో దారుణమైన లాఠీ ఛార్జి చేశారు.

ఈ సందర్భంగా ఒక పోలీసు ఉన్నతాధికారి.. ఆందోళన చేస్తున్న అన్నదాతల తలలు పగులగొట్టాలంటూ ఆదేశాలు ఇవ్వటం.. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. హర్యానాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ రైతులు ఆందోళన ఎందుకు చేశారు? అన్న విషయంలోకి వెలితే.. హర్యానాలో రానున్న కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కసరత్తు ఎంతవరకు వచ్చిందన్న విషయంపై రివ్యూ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆధ్వర్యంలో కర్నాల్ లో బీజేపీ సమావేశం జరిగింది.

ఈ సమాచారం అందుకున్న రైతులు.. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బయలుదేరిన వారిని కర్నాల్ కు 15 కిలోమీటర్ల దూరంలో నిలిపివేశారు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రైతులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో నిర్వహించారు. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధన్ కర్ కాన్వాయ్ తో కర్నాల్ వెళుతున్నారు. ఆయన వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా.. సాధ్యం కాలేదు. దీంతో.. రైతులు మరింత ఆగ్రహానికి గురయ్యారు.

ఇదే సమయంలో.. రైతుల తీరుపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. అదే సమయంలో రైతుల తలలు పగులకొట్టాలంటూ పోలీసు సిబ్బందికి కర్నాల్ జిల్లా ఉన్నతాధికారి ఆయుష్ సిన్హా ఆదేశాలు ఇవ్వటం.. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావటం జరిగింది. అదే సమయంలో.. తమ బాస్ ఇచ్చిన ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించిన పోలీసులు కనిపించిన వారిని కనిపించినట్లుగా లాఠీలతో వీర విహారం చేశారు. ఈ ఉదంతంలో దాదాపు పది మందికి పైగా రైతుల తలలు పగిలిపోయాయి. తీవ్ర గాయాలతో వారు ఆసుపత్రి పాలయ్యారు.

శాంతియుతంగా చేస్తున్న ఆందోళన.. పోలీసుల పుణ్యమా అని రచ్చ రచ్చగా మారినట్లు చెబుతున్నారు. రైతుల తలలు పగలటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆందోళన చేపట్టిన చోట సెక్షన్ 144 అమల్లో ఉందని.. లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తెచ్చేందుకు స్వల్ప లాఠీ ఛార్జి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. చిన్నపాటి లాఠీ ఛార్జికే అంతమంది రైతుల తలలు పగిలిపోతాయా? అన్న ప్రశ్నకు సూటి సమాధానాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏమైనా.. పంజాబ్ లో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్న వేళ.. హర్యానాలో తాజా పరిణామం రానున్న రోజుల్లో అధికార పార్టీని ఆగమాగం చేస్తాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.

Full View
Tags:    

Similar News