పోస్టుమార్టం చేస్తుండ‌గా.. శ‌వం చెయ్యి క‌దిలింది.. బెంగ‌ళూరులో దారుణం!

Update: 2021-03-03 06:30 GMT
పోస్టుమార్టం ఎలా చేస్తారో చాలా మంది నేరుగా చూడ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ఏం చేస్తారో మాత్రం తెలిసే ఉంటుంది. నుదుటిపై సుత్తితో కొట్టి పుర్రెభాగాన్ని వేరుచేసి, బ్రెయిన్ తీస్తారు.. క‌ళ్లు తీసుకుంటారు.. ఆ త‌ర్వాత శ‌రీరాన్ని కోసి ఒంట్లోని ముఖ్య‌మైన పార్ట్స్ సేక‌రిస్తారు. వీటిద్వారా అనుమానాస్ప‌ద మృతి కేసుల‌ను ఛేదిస్తారు. ఏ కార‌ణం చేత చ‌నిపోయారో గుర్తిస్తారు వైద్యులు. అదే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి ముఖ్య‌మైన అవ‌య‌వాలు సేక‌రించి, ఆప‌ద‌లో ఉన్న‌వారికి అమ‌ర్చుతారు. ఈ స్టోరీలోని వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యారు! బ్రెయిన్ డెడ్ అంటే.. బ‌తికి ఉన్న శ‌వం.

బెంగ‌ళూరుకు చెందిన శంకర్‌ గోంబి అనే వ్యక్తి గత నెల 27న క‌ర్నాట‌క‌లోని మహాలింగాపూర్‌ ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో.. అతడిని బెలగావి ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు.. ఆ త‌ర్వాత‌ అతడిని బ్రెయిన్‌ డెడ్‌ అని ప్రకటించారు. విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు భోరున విల‌పించారు. ఇక‌, అత‌డిని చ‌నిపోయిన‌ట్టుగా నిర్ధారించుకున్నారు. అటు ఇంటి వ‌ద్ద అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇటు వైద్యులు పోస్టుమార్టం నిర్వ‌హ‌ణ‌కు క‌త్తులు సిద్ధం చేసుకున్నారు.

బ్రెయిన్ డెడ్ గా ప్ర‌క‌టించ‌బ‌డిన శంకర్‌ గోంబిని పోస్టుమార్టం చేయ‌డానికి మహాలింగాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎస్‌ఎస్‌ గల్‌గాలి అనే వైద్యుడి అధ్వర్యంలోని బృందం పోస్టు‌మార్టం నిర్వహించేందుకు సిద్ధ‌మైంది. శ‌వ‌ప‌రీక్ష గ‌దికి తీసుకెళ్లారు. ఇక‌, ప‌ని మొద‌లు పెట్టేందుకు వైద్య బృందం సిద్ధ‌మై, శంక‌ర్ గోంబి శ‌రీరాన్ని తాకింది. మ‌రి, చేత్తో తాకారా..? క‌త్తితో తాకారా? అన్న‌ది తెలియ‌దుగానీ.. ఆ స్ప‌ర్శ‌కు అతడిలో క‌ద‌లిక వ‌చ్చింది. చేతి రోమాలు నిక్క‌బొడుచుకున్నాయి.

ఇది చూసి పోస్టుమార్టం వైద్య బృందంలోని స‌భ్యులు నిశ్చేష్టుల‌య్యారు. వారి గుండెలు ఝ‌ల్లుమ‌న్నాయి. వెంట‌నే తేరుకొని, శంకర్‌ని మరోసారి పరీక్షించారు. చివ‌ర‌కు అతడు బతికే ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. వెంట‌నే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చ‌నిపోయాడ‌ని అంత్య‌క్రియ‌ల ఏర్పాట్ల‌లో ఉన్న బంధువులు.. ఆశ్చ‌ర్యంతో, ఆనందంతో ఆసుప‌త్రికి ప‌రిగెత్తుకొచ్చారు. ఆ త‌ర్వాత‌ వేరే ఆస్పత్రికి తరలించారు.

ఈ సందర్భంగా పోస్టుమార్టం వైద్యుడు గల్‌గాలి మాట్లాడుతూ.. ‘‘నా 18 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 400 పోస్ట్‌మార్టమ్ లు చేసి ఉంటాను. కానీ.. ఇప్పటి వరకు ఇలాంటి కేసును చూడలేదు. భయంతో గుండె ఆగినంత పని అ‍య్యింది’’ అని అన్నారు. నిజంగా.. ఇదో అసాధారణం. అద్భుతం కదా! ఇది చూసిన వైద్యుల, విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యుల ఫీలింగ్ ఎలా ఉండొచ్చు..?
Tags:    

Similar News