వర్షం పడలేదని .. బాలికలను నగ్నంగా .. !

Update: 2021-09-07 01:48 GMT
దేశం సాంకేతికంగా రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే మనుషులు రాకెట్స్ తో ఆకాశంలోకి వెళ్తున్నారు. ప్రపంచంలో ఏ మూలకైనా క్షణాల్లో కనెక్ట్ అయ్యి , మాట్లాడగలుగుతున్నాం. కానీ, ఇలాంటి రోజుల్లోనూ ఇంకా మూఢ నమ్మకాలు పట్టుకొని వేలాడేవారు చాలా మందే ఉన్నారు. టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా మూఢ నమ్మకాలతోనే ముందుకుపోతుండటం గమనార్హం. తాజాగా ఓ గ్రామంలో వర్షం పడాలని బాలికలను నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం దమోహ్ జిల్లాలోని జబేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బనియా గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. బాలికలతో నగ్నంగా ఊరేగింపు జరిపిస్తే వరుణ దేవుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడన్న అంధ విశ్వాసంతో గ్రామ పెద్దలు సభ్య సమాజం తలదించుకొనే దురాగతానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు తెరపైకి వచ్చాయి. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగ్న ప్రదర్శనకు బాధిత బాలికల తల్లిదండ్రులు సైతం అంగీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వర్షాల కోసం కప్పను ఒక దుంగకు కట్టి, గ్రామంలో ఊరేగించడం చాలామందికి తెలిసిందే. బనియా గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి, వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్‌ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉదంతంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని దమోహ్‌ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
Tags:    

Similar News