అమెరికాలో కాల్పులు.. విశాఖ జిల్లా వాసి మృతి

Update: 2022-02-12 11:32 GMT
గన్ కల్చర్ బాగా పెరిగిపోయిన అమెరికాలో మరోసారి తూటా పేలింది. ఈసారి ప్రవాస భారతీయుడిని అందునా తెలుగువాడిని బలితీసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత మోగింది. అలబామా రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

విశాఖకు చెందిన చిట్టూరి సత్యకృష్ణ(27)  పాత బర్మింగ్ హోంలోని ఓ స్టోర్ లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. సత్యకృష్ణ నెల రోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సత్యకృష్ణ మృతివార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి కూడా ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. సత్యకృష్ణ మృతి విచారకరమన్న ఆయన.. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగు సాయం అందించాలని ఏపీ సీఎం జగన్ ను కోరారు. 


Tags:    

Similar News