ఇలాగైతే...అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌తుందా?

Update: 2017-06-24 04:17 GMT
సాగ‌ర న‌గ‌రం - న‌వ్యాంధ్ర వాణిజ్య రాజ‌ధానిగా ఎదుగుతున్న సాగ‌ర న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలో వ‌రుస‌గా వెలుగులోకి వ‌స్తున్న భూదందాలు జ‌నాన్ని విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. అధికార పార్టీ నేత‌లే ఈ దందాలో పాలుపంచుకుంటున్నారంటూ ఏకంగా టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌ - చంద్రబాబు కేబినెట్‌ లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు గ‌ళం వినిపించిన వైనం ఆ పార్టీలో పెను దుమార‌మే రేపింది. భూ బ‌కాసూరుల నుంచి త‌న‌కు కూడా బెదిరింపులు ఎదుర‌య్యాయంటూ అయ్య‌న్న చేసిన వ్యాఖ్య‌లు... అక్క‌డి భూ దందారాయుళ్ల బ‌ల‌గ‌మెంతో చెప్ప‌క‌నే చెప్పేసింది. అయ్య‌న్న ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఒక్క విశాఖ‌లోనే కాకుండా ఆ జిల్లావ్యాప్తంగా జ‌రిగిన భూ దురాక్ర‌మ‌ణ‌ల‌పై బ‌హిరంగ విచార‌ణ చేప‌డ‌తామంటూ స్పష్టంగా ప్ర‌క‌టించిన ఏపీ డిప్యూటీ సీఎం - రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి... ఆ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గడం వెనుక ఉన్న మ‌త‌ల‌బు కూడా జ‌నానికి తెలియ‌నిదేమీ కాదు.

కేఈ వెన‌క్కు త‌గ్గ‌డం - మొన్న భూ దందాల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి *సేవ్ విశాఖ‌* పేరిట న‌గ‌రంలో ధ‌ర్నాకు దిగుతాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర విచార‌ణ చేయిస్తామంటూ బాబు స‌ర్కారు ప్ర‌క‌టించింది. జ‌గ‌న్ ధ‌ర్నాకు కాస్తంత ముందుగానే ఇందుకోసం ఏకంగా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌)ను కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే జ‌గ‌న్ ధ‌ర్నాకు ఒక్క రోజు ముందుగా సిట్ అధికారులు ప్ర‌భుత్వానికి రాసిన ఓ లేఖ ఇప్పుడు పెద్ద క‌ల‌క‌ల‌మే రేపుతోంది. ఆ లేఖ సారాంశం ఏమిటంటే... విశాఖ భూదందాల‌పై తాము ఏం చేయాలి? ద‌ర్యాప్తు చేయాలా?  విచార‌ణ చేయాలా? అన్న విష‌యంపై క్లారిటీ లేద‌ని చెప్ప‌డ‌మే.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన సిట్... తామేం చేయాలో స్ప‌ష్టంగా పేర్కొనాల‌ని కూడా ప్ర‌భుత్వానికి విన్న‌వించింది. అయినా ద‌ర్యాప్తు అన్నా, విచార‌ణ అన్నా ఒక‌టే క‌దా అని అనుకోవ‌చ్చు. అయితే ఎంత‌మాత్రం కాద‌ని సిట్ అధికారులే ఆ లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. ద‌ర్యాప్తు అనే ప‌దానికి చాలా విస్తృత అర్థం ఉంద‌ని, విచార‌ణ అంటే పైపైన వివ‌రాలు సేక‌రిస్తే స‌రిపోతుంద‌ని వారు చెప్పారు. అంటే భూదందాల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు - వాటిలో ప్ర‌మేయ‌ముంద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తులు, ఎంత‌మేర భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి?  ప్ర‌స్తుతం ఆ భూములు ఎవ‌రి ఆధీనంలో ఉన్నాయి? అన్న వివ‌రాలు సేక‌రించి ఓ నివేదిక రూపంలో ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించ‌డంతో విచార‌ణ పూర్తి అవుతుంద‌ట‌.

అదే ద‌ర్యాప్తు అయితే... భూదందాల‌తో ప్ర‌మేయ‌మున్న వ్య‌క్తుల‌ను విచారించి, వాటిలో వారి ప్ర‌మేయ‌మున్న‌ట్లు తేలితే వారిపై కేసులు న‌మోదు చేయ‌డమే కాకుండా అరెస్ట్ కూడా చేసే అవ‌కాశ‌ముంది. అంతేకాకుండా భూదందాల‌కు వ‌త్తాసు ప‌లికిన నేతాశ్రీలు - అధికారుల వివ‌రాలు కూడా ద‌ర్యాప్తు బ‌య‌ట‌కు వ‌స్తాయి. మ‌రి ప్ర‌భుత్వ‌మేమో... ఈ దందాల‌పై కేవ‌లం విచార‌ణ మాత్ర‌మే చేయాల‌ని సిట్ ఏర్పాటు సంద‌ర్భంగా జారీ చేసిన జీవోలో పేర్కొంది. అంటే... విప‌క్షం చెబుతున్న‌ట్లు విశాఖ భూదందాల‌పై చంద్ర‌బాబు స‌ర్కారు ఉత్తుత్తి ద‌ర్యాప్తున‌కు మాత్ర‌మే ఆదేశాలు జారీ చేసింద‌న్న మాట‌. ఇదేదో ప్ర‌భుత్వ‌మంటే గిట్ట‌ని వారు చెప్పిన మాట కాదు క‌దా. సాక్షాత్తు సిట్‌లో స‌భ్యులుగా ఉన్న ద‌ర్యాప్తు అధికారులు చెప్పిన మాట‌. మ‌రి ఈ విచార‌ణ‌లో బాధితుల‌కు ఏ మేర‌కు న్యాయం  జ‌రుగుతుందో,  అదే స‌మ‌యంలో భూ బ‌కాసూరుల‌కు ఏ మేర‌కు శిక్ష ప‌డుతుందో... ఈ ఒక్క చ‌ర్య‌తో తేలిపోయిందిగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News