చెత్త రికార్డుతో ఆ టీడీపీ లీడ‌ర్ కెరీర్ క్లోజ్‌..!

Update: 2019-07-15 05:13 GMT
అదేమిటోగానీ.. కొంద‌రి నేత‌ల త‌ల‌రాత‌లను ప్ర‌జ‌లు భ‌లేగా రాస్తారు.. పార్టీల అధిష్ఠానాలు ఆయా నేత‌ల‌ను నెత్తిమీద పెట్టుకున్నా.. జ‌నం మాత్రం ఓట్లేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉండ‌రు. ఎన్నిసార్లు అధిష్ఠానం నుంచి టికెట్లు తెచ్చుకున్నా.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఓడిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకే వ‌స్తున్నారు ఓ మాజీ మంత్రి. పాపం ఆయ‌న‌ను సుమారు రెండు ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌లు అస్స‌లే క‌రుణించ‌డం లేదు. వ‌రుస‌బెట్టి ఓడిస్తున్నారు. అయితే.. ఇదే స‌మ‌యంలో పార్టీ మాత్రం ఆయ‌న‌ను నెత్తిన‌పెట్టుకుని చూస్తోంది. ఎందుకంటే.. ఆయ‌న నోరు తెరిస్తే.. ప్ర‌త్య‌ర్థులు చుక్క‌లు చూడాల్సిందే. అంత వాగ్ధాటితో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేశారు. కానీ.. ఏం లాభం.. ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను మాత్రం ఆయ‌న గెలుచుకోలేక‌పోతున్నారు. ఇంత‌కీ.. ఆ మాజీ మంత్రి ఎవ‌రని అనుకుంటున్నారా..?

ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌ రెడ్డి. టీడీపీలో ఎన్టీఆర్ హ‌యాం నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కు ఆయ‌న‌కు తిరుగులేదు. పార్టీకి అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా కొన‌సాగుతున్నారు. నిజానికి.. ఎన్టీఆర్‌తో నేరుగా వెళ్లి మాట్లాడ‌గ‌లిగిన నేత‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో రాజకీయ ఆరంగేట్రం చేసిన‌ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. కేవ‌లం 1994 - 1999 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఆయ‌న‌ గెలుపొందారు. ఇక‌ ఆ తర్వాత వ‌చ్చిన ఐదు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఓడిపోతూనే ఉన్నారు. అయినా.. పార్టీ మాత్రం ఆయ‌న‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తూనే ఉంది. ఒకటికాదు - రెండుకాదు వరుసగా ఐదుసార్లు ఓటమి పాలుకావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆయ‌న కుమారుడు రాజ‌గోపాల్‌ రెడ్డి కూడా రాజ‌కీయాల్లో రాణించ‌క‌పోవ‌డంతో భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

2004 - 2009 ఎన్నిక‌ల్లో త‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి ఆదాల ప్ర‌భాక‌ర్‌ రెడ్డి చేతిలో ఆయ‌న ఓడిపోయారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో సోమిరెడ్డి ఓడిపోయినా.. చంద్ర‌బాబు ఆద‌రించారు. ఆయ‌నకు ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. ఏకంగా మంత్రిని చేశారు. ఇక ఇదే అద‌నుగా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. ఇదే స‌మ‌యంలో త‌న రాజ‌కీయ వార‌సుడిగా కుమారుడు రాజ‌గోపాల్‌ రెడ్డిని ప్ర‌జ‌ల్లోకి తీసుకొచ్చారు. కానీ.. ఆయ‌న కూడా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయారు. మ‌రోవైపు.. ఇదే జిల్లా నుంచి నారాయ‌ణ‌ను పార్టీలోకి తీసుకున్న చంద్ర‌బాబు.. ఏకంగా ఆయ‌న‌ను కూడా మంత్రిని చేశారు. ఇదే సోమిరెడ్డికి పెద్ద‌మైన‌స్‌ గా మారింది. సోమిరెడ్డికి అడ్డుక‌ట్ట వేసేందుకే నారాయ‌ణ‌ను రంగంలోకి దించార‌నే టాక్ అప్ప‌ట్లో బ‌లంగా వినిపించింది.

ఐదేళ్ల పాటు జిల్లా రాజ‌కీయాల్లో ఆధిప‌త్యం కోసం నారాయ‌ణ వ‌ర్సెస్ సోమిరెడ్డి మ‌ధ్య ఓ రేంజులో వార్ న‌డిచింది. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా తాను గెలుస్తాన‌న్న ధీమాతో ఉన్న సోమిరెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేను ఓడిస్తాన‌ని. త‌నదే విజ‌య‌మ‌ని అనుకున్నారు. కానీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ దూకుడుతో టీడీపీ తుడుచుచుపెట్టుకుపోయింది. ఈ ఎన్నిక‌ల్లోనూ సోమిరెడ్డిని ప్ర‌జ‌లు క‌రుణించ‌లేదు. వ‌రుస‌గా రెండోసారి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మ‌రో ఐదేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఈ ప్ర‌తికూల ప‌రిణామాల నుంచి సోమిరెడ్డి బ‌య‌ట‌ప‌డుతారా.. ?  లేక రాజ‌కీయాల‌కు గుడ్‌ బై చెబుతారా..? అన్న‌ది తెలియాలంటే మ‌రికొద్దికాలం ఆగాల్సిందే మ‌రి.


Tags:    

Similar News