బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి సోము రాజీనామా? నిజ‌మేనా? రీజ‌నేంటి?

Update: 2021-11-21 02:30 GMT
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు.. సోము వీర్రాజు త‌న ప‌ద‌వికి రిజైన్ చేస్తారా? ప్ర‌స్తుతం ఆయ‌న కొన్నాళ్లుగా మ‌న‌స్థాపంగా ఉన్నారా? పార్టీలో జ‌రుగుతున్న తెర‌వెనుక చ‌ర్య‌ల‌తో ఆయ‌న ఇబ్బంది ప‌డుతున్నారా? పార్టీని పుంజుకునేలా చేయ‌డంలో ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు స‌హ‌క‌రించే నాయ‌కులు క‌నిపించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీ ముఖ్యంగా సోము వీర్రాజును ఒంట‌రిని చేసే వ్యూహం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. దీనికి కార‌ణాలు ఏంటి? ఎందుకు? అంటే.. ఆర్ ఎస్ ఎస్ భావ‌జాల‌మే నేప‌థ్యంగా కాపు సామాజిక‌ వర్గానికి చెందిన సోము వీర్రాజు.. బీజేపీ ఏపీ ప‌గ్గాలు అందుకున్నారు. నిజానికి అటు ఆర్ ఎస్ ఎస్, ఇటు బీజేపీలు ఆయ‌న‌పై ఆశ‌లు పెట్టుకున్నాయి.

కాపు సామాజిక వ‌ర్గాన్ని పార్టీకి చేరువ చేయ‌డంతోపాటు.. రాష్ట్రంలో పార్టీని ప‌రుగులు పెట్టించ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలు వేసుకున్నారు. దీనిని సాకారం చేస్తాన‌ని సోము కూడా చెప్పారు. చిన్న‌ప్ప‌టి నుంచి ఆర్ ఎస్ ఎస్‌లో ఉండ‌డం.. ఇత‌ర పార్టీల జోలికి పోక‌పోవ‌డం.. గెలిచినా ఓడినా.. బీజేపీ కండువాతోనే తిర‌గ‌డంతో ఆయ‌న‌పై కేంద్రంలోని పెద్ద‌లు భ‌రోసా పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న టీడీపీని టార్గెట్ చేయ‌డం.. కిందిస్థాయి నేత‌ల‌కు స‌రైన గుర్తింపు ఇవ్వ‌క పోవ‌డం వంటివి కొన్నాళ్లుగా వివాదం గా మారాయి. మ‌రోవైపు.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు, స‌హ ఇంచార్జ్‌.. సునీల్ దేవ్‌ధ‌ర్‌, స‌త్య కుమార్‌.. కేంద్రంలోనే చ‌క్రం తిప్పుతున్న మ‌రో నాయ‌కుడు.. కూట‌మిగా ఏర్ప‌డ్డార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. వీరు కేంద్రంలోని న‌డ్డా, అమిత్ షా వ‌ర్గాలుగా ప్ర‌చారం ఉంది.

ఇక‌, సోమును చూసుకుంటే.. వ‌ర్గాల‌కు అతీతంగా ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలంతో ముందుకు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు.. ఈ కూట‌మికి మ‌ధ్య విభేదాలు పొడ‌చూపుతున్నాయి. సోము ఒక అడుగు ముందుకు అంటే.. వీరు నాలుగు అడుగులు వెన‌క్కి లాగ‌డం ప‌రిపాటిగా మారింది. ఇక‌, దీనికి తోడు.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌, దీనికి ముందు వ‌చ్చిన పంచాయ‌తీ, స్థానిక సంస్థ‌లు, కార్పొరేష‌న్ వంటివి కూడా సోముకు అగ్నీప‌రీక్ష‌గా మారాయి. ఒక‌వైపు జ‌న‌సేన‌తో పొత్తు ఉన్నా.. వారితో క‌లిసి ప‌నిచేసే వ్యూహాన్ని సోము నిర్ణ‌యించుకోలేక పోయార‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. సోము అజెండా వేరు.. జ‌న‌సేన అజెండా వేరు. ఫ‌క్తు హిందూత్వ అజెండాతో సోము ముందుకు సాగారు. దేవాల‌యాల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు ఏక‌ప‌క్షంగా పోరాడారు.

అయితే.. ఇది ముస్లిం మైనారిటీని త‌మ‌కు దూరం చేస్తుంద‌ని .. భావించిన జ‌న‌సేన బీజేపీకి దూరంగా ఉండిపోయింది. ఇక‌, తిరుప‌తి పార్ల‌మెంటులో సోము టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్టి.. బీజేపీకి ఇప్పించుకోవ‌డం.. కూడా జ‌న‌సేన‌కు కిట్ట‌డం లేదు. వీటికితోడు.. నేత‌ల మ‌ద్య స‌ఖ్య‌త లేదు. దీంతో కేంద్రంలో మంచి ఫాలోయింగ్ ఉన్న సునీల్ అన్నీతానై తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో సోము వ్యూహాలు ఫ‌లించ‌డం లేదు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి విష‌యంలో సోము ఒక విధంగా వ్యాఖ్యానిస్తే.. సునీల్ మ‌రో విధ‌మైన కుంప‌టి ర‌గిలించారు. ప్ర‌చారంలో నూ క‌లిసి రాలేదు. ఫ‌లితంగా అన్ని చోట్లా బీజేపీ విఫ‌ల‌మైంది. అయితే.. దీని తాలూకు ఫ‌లితం మాత్రం.. సోము అనుభవించాల్సి వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న క‌లిసి రాని నేత‌ల‌తో ఎన్నాళ్లు సాగ‌దీస్తాం.. అనుకుంటున్నార‌నే గుస‌గుస కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షాకు వివ‌రించారు. దీంతో ఆయ‌న సోముకే మ‌ద్ద‌తుగా మాట్లాడారు. అంద‌రూ సోము మాట వినాల్సిందేన‌ని క‌రాఖండీగా చెప్పారు. అయితే.. షా అటు వెళ్లారో .. లేదో .. మ‌ళ్లీ య‌ధాలాపంగా కూట‌మి పాలిటిక్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో తీవ్ర‌క‌ల‌త చెందుతున్న సోము.. రాజీనామా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీనికి మ‌రో కార‌ణం కూడా ఉంది. జ‌న‌సేన నేత‌లు కూడా ఆయ‌న‌ను పొత్తు పార్టీ నేత‌గా గుర్తించ‌డం లేదు. అయితే.. సోము రాజీనామా చేయ‌ర‌ని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. ఎందుకంటే.. సోముకు వ‌చ్చిన అవ‌కాశం.. వ‌దులుకుంటే.. రాష్ట్రంలో మ‌ళ్లీ ఆయ‌న నిలుదొక్కుకునేందుకు అవ‌కాశం లేదు. పైగా బీజేపీ అధిష్టానం కూడా ఇప్ప‌టికిప్పుడు ఆకాశం ఊడిప‌డి.. అధికారం అందుతుంద‌నే అంచ‌నాలు ఏమీ వేసుకోవ‌డం లేదు. కానీ. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా మాత్రం ఎద‌గాల‌ని కోరుకుంటోంది. ఈ నేప‌థ్యంలో మున్ముందు సోము వ్య‌వ‌హ‌రించే తీరు మాత్రం మార‌నుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News