పర్మిషన్లు తీసుకోను.. ఏం చేసుకుంటారో చేసుకోండి సోము ఫైర్

Update: 2022-08-29 04:10 GMT
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు కోపం వచ్చింది. ఆయనకు అప్పుడప్పుడు కోపం వస్తూనే ఉంటుంది. కానీ.. ఈసారి వచ్చిన కోసం కాస్తంత తీవ్రమైనదే. ఏపీలోని జగన్ సర్కారుపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తనను అరెస్టు చేసినా సరే.. తన మాటను మాత్రం మార్చుకోనని స్పష్టం చేస్తున్నారు.

జగన్ సర్కారుకు ఆయన భారీ సవాలు విసిరిన ఆయన.. 'ఏం చేసుకుంటారో చేసుకోండి.. నేను మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోను. అరెస్టు చేసినా సరే.. తగ్గేదే లేదు' అని తేల్చేశారు. ఇంతకీ ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే.. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాల విషయంలో ముందస్తు అనుమతులు తీసుకోవాలన్న నిబంధనపై ఆయన మండిపడుతున్నారు.

గణేష్ ఉత్సవాల్ని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని చెబుతున్న ఆయన... ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాజమహేంద్రవరంలో నిర్వహించే వినాయకచవితి ఉత్సవాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.

దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాలు విసిరారు. ఎక్కడైనా గణేశ్ ఉత్సవ వేడుకలకు సంబంధించి ఎవరైనా అడ్డుకుంటే బీజేపీకి సమాచారం ఇవ్వాలన్నారు. అలాంటి వారందరికి తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

నవరాత్రులు వచ్చే వరకు ఏపీ అధికారులు ఏం చేశారని ప్రశ్నించిన సోము.. 'ఇంతకాలం టైం వేస్టు చేసిన అధికారులు ఇప్పుడు ఫైర్.. పోలీస్.. విద్యుత్ పర్మిషన్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగ విషయంలో కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

నిబంధనల పేరు చెప్పి అడ్డుకోవాలని చూస్తే బీజేపీ ఊరుకోదన్న ఆయన.. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు అక్కర్లేదని చెబుతున్నారు. మరి.. సోము వార్నింగ్ కు జగన్ ప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందో?
Tags:    

Similar News