కీలక అంశం పై జగన్‌ కు సోము వీర్రాజు లేఖ!

Update: 2023-04-13 14:34 GMT
ఏపీ సీఎం జగన్‌ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఏపీలో సమగ్ర కుల గణన జరిపించాలని ఆ లేఖలో కోరారు. అందరికీ సమన్యాయం జరగాలన్నా.. ఏ కులం పరిస్థితి ఏమిటో తెలియాలన్నా.. ఆయా కులాల జనాభా తెలుసుకోవాలన్నా సమగ్ర కులగణన జరిగి తీరాల్సిందేనని సోము వీర్రాజు తెలిపారు. ఏ కులానికి బీసీలుగా చేర్చడానికి అర్హత ఉంది? ఎవరికి లేదు వంటి విషయాలు తెలియాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని పేర్కొన్నారు.

అందువల్లే కేంద్రంలో 1953లో కాకా కలేల్కర్‌ కమిషన్, 1968లో ఆంధ్రప్రదేశ్‌ లో అనంతరామన్‌ కమిషన్, 1980లో మండల్‌ కమిషన్‌ భవిష్యత్తులో కుల గణన జరిపించాలని వాటి నివేదికలలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా సోము వీర్రాజు గుర్తు చేశారు.

భారత దేశంలో 1931 తర్వాత కుల గణన జరగలేదని సోము వీర్రాజు తన లేఖలో సీఎం జగన్‌ కు తెలిపారు. దేశ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారన్నారు. గత ఏడు దశాబ్దాలకు పైగా సరైన స్థాయిలో రిజర్వేషన్లు లేకపోవడంతో దామాషా అవకాశాలు పొందలేక బీసీలు అభివృద్ధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల స్థాయిలో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, వాటిని పర్యవేక్షించాలన్నా కులగణన తప్పనిసరిగా చేయాల్సిందేనన్నారు.

దేశంలో అనేక రాష్ట్రాలు కులగణన జరపాలని కోరుతున్నాయని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలు వాటి శాసనసభల్లో కులగణనకు సంబంధించి తీర్మానాలు కూడా చేశాయన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2011 నవంబర్‌ 23న శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించిందని సోము గుర్తు చేశారు.

ఇప్పటికే ఒడిశా, బిహార్‌ సమగ్ర కుల గణన జరిపిస్తున్నాయని సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో ఈ రెండు రాష్ట్రాలు కులగణన నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం 105వ రాజ్యాంగ సవరణ చేశాక పలు రాష్ట్రాలు కులగణన ప్రారంభించాయని సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తితో రాష్ట్రాలు కులగణన చేయాలని పేర్కొందని వెల్లడించారు. అయితే రాష్ట్రాలు కులగణన చేయకుండా అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నట్టు నెపాన్ని తోసేస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయాలని సోము వీర్రాజు తన లేఖలో కోరారు.

Similar News