బాబుపై ప్ర‌శంస‌లు!... వీర్రాజు రూట్ మార్చేశారే!

Update: 2018-01-28 07:40 GMT

సోము వీర్రాజు... బీజేపీ సీనియర్ నేగా, ఏపీ శాస‌న‌మండ‌లిలో ఆ పార్టీ ఎమ్మెల్సీగానే కాకుండా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌ద్ద మంచి ప‌లుకుబ‌డి క‌లిగిన నేత‌గా మ‌నందరికీ తెలుసు. మోదీ ప్ర‌ధాని కాగానే... జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేని, సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌లు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తిదిత‌రులంతా ఢిల్లీలో ల్యాండైతే... వారింద‌రికీ మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించ‌డం ద‌గ్గ‌ర నుంచి వారిని ద‌గ్గ‌రుండి మ‌రీ మెదీ వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డం దాకా మొత్తం వీర్రాజే చూసుకున్నారు. నాడు మోదీ అపాయింట్ మెంట్ కావాలంటే వీర్రాజును దువ్వితే స‌రిపోతుంద‌న్న మాట కూడా వినిపించింది. ఇంత‌దాకా బాగానే ఉన్నా... ఆది నుంచి టీడీపీ అంటే అంతెత్తున ఎగిరిప‌డే వీర్రాజు... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లామ‌ని, ఆ పార్టీ ఎమ్మెల్యేల స‌హ‌కారంతోనే తాను ఎమ్మెల్సీ కాగ‌లిగాన‌న్న మాట‌ను ప‌క్క‌న‌పెట్టేసి టీడీపీపై - ఆ పార్టీ ప్ర‌భుత్వంపై - ఏకంగా ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై త‌న‌దైన శైలిలో రెచ్చిపోయారు.

ఇలా ఒక‌సారి కాదు, రెండు సార్లు కాదు... అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా, అవ‌కాశం చిక్క‌న‌ప్పుడు కూడా వీర్రాజు త‌న‌దైన శైలిలో బాబు అండ్ కోపై ఫైరైపోయారు. ఈ వ్య‌వ‌హారమంతా బీజేపీ అధిష్ఠానానికి ప్ర‌త్యేకించి మోదీకి తెలిసినా ఏ ఒక్క‌రు కూడా వీర్రాజును నిలువ‌రించే య‌త్నం చేయ‌లేదు. చంద్ర‌బాబు స‌ర్కారు పాల‌న‌లో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని, తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌జ‌ల‌ను దోచుకు తింటున్నార‌ని, మ‌ద్యాన్ని ఏరులై పారిస్తున్నార‌ని, జ‌న్మ‌భూమి క‌మిటీల పేరిట నానా యాగీ చేస్తున్నార‌ని... ఇలా ఇష్ట‌మొచ్చిన రీతిలో వీర్రాజు టీడీపీ పాల‌న‌పై నిప్పులు చెరిగారు. అయితే నిన్న తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మీడియాతో మాట్లాడేందుకు వ‌చ్చిన వీర్రాజు చాలా కొత్త‌గా వ్య‌వ‌హ‌రించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ... నిత్యం తాను తిట్టే చంద్ర‌బాబును ఆయ‌న ఏకంగా ఆకాశానికెత్తేశారు. చంద్ర‌బాబును ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడారు. చంద్ర‌బాబులా క‌ష్ట‌ప‌డే నేతే లేరంటూ కితాబిచ్చారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై వీర్రాజు ప్ర‌శంస‌లు ఎలా సాగాయంటే... *ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యకృషీవలుడు. ఆయనకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి వద్దా ఉండదు. కేంద్రంనుంచి ఎన్ని నిధులు వచ్చినా, ఇంకా రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్‌ ఏమి చేసింది?...నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టులో భాగంగా రెండు కాలువలు తవ్వారు. అవి కూడా అంతంతమాత్రమే. ఒక కాలువ పనులు 40 శాతం, రెండో కాలువ పనులు 60 శాతమే చేశారు. చంద్రబాబు మాత్రం సోమవారం, పోలవరం అంటూ నిత్యం పాకులాడుతూనే ఉన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఉన్నారు. అయితే చంద్రబాబు అంత అవిశ్రాంతంగా పనిచేయడం కేంద్రం అందిస్తున్నసహకారం వల్లే సాధ్యపడుతోంది* అని వీర్రాజు చాలా కొత్త‌గా, చాలా ఇంటరెస్టింగ్ గా బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

చివ‌ర‌గా... చంద్ర‌బాబు ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నా... ప్ర‌ధానిగా మోదీకి ఏపీలో ద‌క్కాల్సిన ప్ర‌చారం మాత్రం ద‌క్క‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్రం నిధులతో చేపట్టే కార్యక్రమాలలో కూడా ఎక్కడా ప్రధాని బొమ్మను మాత్రం ప్రదర్శించడం లేదని... మోదీ బీసీల్లోని చిన్నకులానికి చెందిన వ్యక్తి కాబట్టే అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు విమర్శిస్తున్నారని వీర్రాజు వ్యాఖ్యానించారు. మొత్తానికి నిత్యం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల బాణాలు సంధించే వీర్రాజు...ఉన్న‌ట్టుండి ఆయ‌న‌పై పొగ‌డ్తల వ‌ర్షం కురిపించ‌డం వెనుక కార‌ణాలేమై ఉంటాయ‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. బీజేపీ అధిష్ఠానం నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తోనే వీర్రాజు యూట‌ర్న్ తీసుకుని ఉంటార‌ని, బీజేపీ అధిష్ఠానం మిన‌హా వీర్రాజును క‌ట్ట‌డి చేసే వారు ఎవ‌రూ లేర‌న్న కోణంలో ఈ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రి వీర్రాజును ఈ త‌ర‌హాలో మౌల్డ్ చేయ‌డానికి గ‌ల కార‌ణాలు బీజేపీకి ఏం క‌నిపించాయో తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News