బీజేపీలో కొత్త ట్విస్ట్‌..ఇప్పుడు వీర్రాజు వంతు!

Update: 2020-01-02 17:19 GMT
'నేను చెప్పేదే జాతీయ పార్టీ విధానం...మా పార్టీలో ఎవరు ఏం మాట్లాడినా అది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే` ఇది  భారతీయ జనతా పార్టీ జాతీయ‌ అధికార ప్రతినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు ఇటీవ‌ల చేసిన కామెంట్‌. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీని తీవ్రంగా ఇరుకున పెడుతుండ‌టంతో...పార్టీ సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు అయిన‌ జీవీఎల్ నరసింహారావు ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చేశారు. అయితే, అక్క‌డితో...బీజేపీ నేత‌ల కామెంట్లు ఆగిపోలేదు...ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి.

వాస్త‌వంగా, మూడు రాజధానుల అంశంపై అన్ని పార్టీ ల్లోనూ భిన్న స్వ‌రాలు ఉన్నాయి. అయితే, ప్ర‌ధానంగా అంద‌రి దృష్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప‌డింది. బీజేపీ నేత‌లు మాత్రం విభిన్న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి ఒక అంగుళం కూడా కదలనిచ్చేది లేదని బీజేపీ నేత,రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని నిర్మాణమంటే ఒక కారు వదిలేసి మరో కారు కొన్నంత ఈజీ కాదని చురకలంటించారు. అనంత‌రం మాట్లాడిన ఎంపీ జీవీఎల్‌ - ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు. రాజధాని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించలేదు.. అలాగే రాజధానిని మార్చాలని కూడా కేంద్రం చెప్పలేదన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కేంద్రం సూచనలు చేస్తుందన్నారు. తాను చెప్పేదే జాతీయ పార్టీ విధానం అని క్లారిటీ ఇచ్చేశారు.

అయితే, తాజాగా ఏపీ బీజేపీ ముఖ్య‌నేత‌ - ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ... అమరావతి అనే భ్రమను సృష్టించి.. చంద్రబాబు ప్రజలను గందర గోళ పరుస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు ఆ భ్రమలో పడవద్దని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ స‌ర్కారుకు సైతం ఆయ‌న హిత‌బోధ చేశారు. అమరావతి రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, రాష్ట్రంలో ప్రతీ జిల్లాను రాజధాని తరహాలో అభివృద్ది చేయాలన్నారు. రాయలసీమలో పరిశ్రమలు - కోస్తాలో పోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. వీర్రాజు మాటల త‌ర్వాత‌...బీజేపీ విధానంపై స్ప‌ష్ట‌త రావాల్సింది పోయి మ‌రింత గంద‌ర‌గోళం మొద‌ల‌యింద‌ని అంటున్నారు.


Tags:    

Similar News