మళ్లీ రంగంలోకి దిగిన సోనియా!

Update: 2019-06-01 12:53 GMT
ఒకవైపు వయసు మీద పడుతున్నా పార్టీ బాధ్యతలు మాత్రం మళ్లీ నెత్తికెత్తుకోవాల్సి వస్తోంది సోనియాగాంధీ. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష బాధ్యతల నుంచి కొంత కాలం కిందటే సోనియాగాంధీ వైదొలిగారు. ఆ బాధ్యతలను తన తనయుడు రాహుల్ గాంధీకి అప్పగించి సోనియా తప్పుకున్నారు. వయసు మీద పడటం, ఆరోగ్యం పూర్తి స్థాయిలో సహకరించకపోవడం వంటి కారణాలతో అప్పుడు సోనియాగాంధీ తప్పుకున్నారు. తనయుడికి బాధ్యతలు అప్పగించి ఆమె రాజకీయ కార్యకలాపాలకు చాలా వరకూ దూరం అయ్యారు కూడా.

అయితే తనయుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికలను ఎదుర్కొనడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఫెయిల్ కావడం సోనియాగాంధీని ఇబ్బంది పెడుతూ ఉంది. వరసగా రెండో సారి కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు అయ్యింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేకపోయింది ఈ సారి కూడా!

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీనేమో వైరాగ్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. తల్లి ఎంతగానో ముచ్చటపడి, తనయుడికి పార్టీ అధ్యక్షపీఠాన్ని అప్పగిస్తే అతడేమో దాన్ని వద్దు అంటున్నారు. రాజీనామా అంటూ మారం చేస్తున్నారు. ఆ విషయంలో కాంగ్రెస్  నేతలు సర్ది చెబుతున్నా  రాహుల్ గాంధీ మాత్రం వినడం లేదు. రాజీనామా అంటూ పట్టుపడుతూ ఉన్నాడు.

ఈ క్రమంలో ఆ వ్యవహారం ఎటూ తేలలేదు. రాహుల్ కు సోనియాగాంధీ కూడా  సర్ధి చెబుతూ ఉంది. మరోవైపు ఆమె మళ్లీ క్రియాశీల బాధ్యతలు తీసుకోవడం విశేషం.కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేతగా సోనియాగాంధీ బాధ్యతలు తీసుకున్నారు.

కాంగ్రెస్ ఎంపీలందరికీ మళ్లీ సోనియాగాంధీ అధ్యక్షురాలిగా వ్యవహరించబోతున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి సోనియా తప్పుకుందని అంతా అనుకున్నారు. ఈ ఎన్నికల ముందు ఆమె గతంలోలా క్రియాశీలకంగా పని చేయలేదు కూడా. అయితే పార్టీ మళ్లీ ప్రతిపక్ష వాసానికే పరిమితం కావడంతో సోనియాగాంధీ తప్పనిసరిగా రంగంలోకి దిగి.. మళ్లీ యాక్టివ్ పొలిటీషియన్ అవుతున్నారు!
Tags:    

Similar News