అరె.. సోనియా సంగతి ఏం చేశారు చంద్రబాబు..?

Update: 2015-10-18 05:27 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం అందరిని ఆహ్వానిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటం తెలిసిందే. ఆ మాటకు తగ్గట్లే ఆయన పలువురిని పిలవటం కనిపించింది. ప్రతిఒక్కరిని గుర్తుపెట్టుకొని మరీ పిలిచినట్లుగా కనిపించినప్పటికీ.. అత్యంత కీలకమైన ఒక వ్యక్తి విషయంలో చంద్రబాబు అస్సలు పట్టించుకున్నట్లుగా కనిపించలేదు.

రాష్ట్ర విభజనలో కర్త.. కర్మ.. క్రియ అన్నీ తానై అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఇన్విటేషన్ ఇచ్చే విషయంలో పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు. దీనికి తోడు పవర్ లో లేని అమ్మ గురించి పెద్దగా పట్టించుకోలేదు. పదేళ్ల పాటు దేశాన్ని రిమోట్ కంట్రోల్ మాదిరి శాసించిన అమ్మకు.. ఈ రోజు శంకుస్థాపన ఆహ్వాన పత్రం ఎవరు ఇస్తారో కూడా తెలీని పరిస్థితి.

నిజానికి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కారణం సోనియమ్మే. ఆ యమ్మే విభజన నిర్ణయం కానీ తీసుకోకుంటే.. అమరావతి అన్న మాటే ఉండేది కాదు. అమరావతి నిర్మాణ కోణంలో చూస్తే.. అందరి కంటే ముందు సోనియాను పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆమె అన్న వ్యక్తే లేకపోతే.. అమరావతి లేదు. ఆసక్తికరంగా.. అమరావతికి కారణమైన సోనియమ్మకు ఈ రోజు అదే అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం విషయంలో ఎవరికీ పెద్దగా పట్టకపోవటం చూస్తే.. పవర్ లోనే అంతా ఉందన్న భావన కలగక మానదు. కాంగ్రెస్ అధినేత్రికి ఆహ్వానపత్రం ఇస్తున్నారా? ఇస్తుంటే ఆమెను కలవటానికి ఎవరు వెళుతున్నారు? ఆమె టైం ఇచ్చారా? లాంటి ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో మాత్రమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News