సోనూ సూద్ ను అనుమానించారు.. ఆ త‌ర్వాత‌..?

Update: 2021-05-18 14:30 GMT
గతేడాది క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని చుట్టుముట్టడంతో మొద‌లైన సోనూ సూద్ సేవాకార్య‌క్ర‌మాలు.. కొవిడ్ తోపాటుగానే కొన‌సాగుతున్నాయి. సెకండ్ వేవ్ ఏస్థాయిలో ఉధృతమైందో.. అత‌డి సేవ‌లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.

సుమారు నాలుగు వంద‌ల మందితో దేశ‌వ్యాప్తంగా నెట్వ‌ర్క్ ఏర్పాటు చేసుకొని, ఎక్క‌డి నుంచి స‌హాయం కావాల‌ని పిలుపు అందినా.. వెంట‌నే వాలిపోతున్నాడు. మందులు, ఆక్సీజ‌న్‌, బెడ్స్ వ‌గైరా.. అవ‌స‌రాలు ఎలాంటివైనా తానున్నా అంటూ ఆప‌న్న‌హ‌స్తం అందిస్తున్నాడు.

అయితే.. ఇంత‌గా స‌హాయం చేస్తున్న అత‌నిమీద దుష్ప్ర‌చారం కూడా సాగుతోంది. పేరుకోస‌మే ప్ర‌చారం చేసుకుంటున్నాడ‌ని అనేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా.. ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న చోట‌.. అధికార పార్టీల మ‌ద్ద‌తు దారులు సోనూను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. అత‌ని సేవ‌ను త‌గ్గించి చూపే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఒడిషాలో వెలుగు చూసింది.

ఒడిషాలోని గంజాం జిల్లాలో ఒక వ్య‌క్తికి ఆక్సీజ‌న్ బెడ్ కావాల‌ని సోనూ టీమ్ ను కోరారు. ఆ త‌ర్వాత స‌ద‌రు వ్య‌క్తికి బెడ్ అరేంజ్ చేసిన‌ట్టు సోనూ ఒక ట్వీట్ చేశారు. అయితే.. కాసేప‌టి త‌ర్వాత అత‌డికి బెడ్ తామే అరేంజ్ చేశామ‌ని, సోనూ టీమ్ నుంచి త‌మ‌ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని గంజాం జిల్లా క‌లెక్ట‌ర్ పేరుతో ఉన్న‌ ట్విట‌ర్ ఖాతా నుంచి మెసేజ్ పోస్టు అయ్యింది.

దీంతో.. అంద‌రూ సోనూపై సందేహాలు వ్య‌క్తంచేశారు. అతడి సేవ‌లు కూడా ఇలాంటివే కావొచ్చ‌ని కామెంట్లు చేశారు. దీంతో.. సోనూ సాక్ష్యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. స‌ద‌రు బాధితుడితో జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణ‌ను స్క్రీన్ షాట్ తీసి పోస్టు చేశారు. అత‌ను ఆక్సీజ‌న్ సౌక‌ర్యం ఉన్న బెడ్ కోర‌డం.. తాము అరేంజ్ చేయ‌డం.. అత‌ను ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డం వంటి వివ‌రాలు ఆ స్క్రీన్ షాట్లో ఉన్నాయి.

అంతేకాదు.. తాము ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను సంప్ర‌దించిన‌ట్టు చెప్ప‌లేద‌ని, ఏదో విధంగా బాధితుడికి బెడ్ అందేలా చూడాల‌ని మాత్ర‌మే ప్ర‌య‌త్నించామ‌ని చెప్పాడు సోనూ. అదే సంద‌ర్భంలో ప్ర‌భుత్వ యంత్రంగా చేస్తున్న సేవ‌ల‌ను కూడా కొనియాడారు సోనూ. దీంతో.. అప్ప‌టి వ‌ర‌కూ సోనూపై నింద‌లు వేసిన వాళ్లంతా నోటికి ప్లాస్ట‌ర్ అంటించుకున్నారు.
Tags:    

Similar News