బీజేపీకి కొత్త పేరు పెట్టిన చలసాని శ్రీనివాస్ .. ఏంటంటే !

Update: 2021-06-22 06:39 GMT
బీజేపీ..అంటే భారతీయ జనతా పార్టీ అని అందరికి తెలిసిందే. దాన్నే షార్ట్ గా బీజేపీ అని పిలుస్తుంటారు. అయితే, తాజాగా బీజేపీ కి ఆంధ్రా మేధావుల ఫోరం ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ కొత్త పేరును పెట్టారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని , ఉత్తర భారతీయ జనతా పార్టీ అని   చలసాని శ్రీనివాస్ అన్నారు. తెలుగు రాష్ట్రాల వారికి బీజేపీ పెద్దలు తీరని అన్యాయం చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు దేశంలో ఎవరికీ తీసిపోరని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించుకున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఒకనాడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను తెలుగు వారు పాలించారని, ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కేంద్ర మంత్రి కూడా క్యాబినెట్ లో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయడానికి ఒక్క తెలుగువారు కూడా తగరా మోడీజీ అంటూ గట్టిగానే విమర్శించారు. అంతే కాదు, దేశంలోని పలు రాష్ట్రాలలో వంద ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం పెడుతోందని, రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఒక్కటంటే ఒక్క ప్లాంట్ కూడా ఎందుకు పెట్టరని నిలదీశారు.  అన్నీ గుజరాత్ కే అన్నట్లుగా కేంద్రం అభివృద్ధిని తీసుకుపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నాలకు ఎందుకు మెట్రో రైళ్ళు ఇవ్వరని చలసాని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో తాము కచ్చితంగా కేంద్రం మీద యుద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమన్న చలసాని ఏపీలోని అధికార విపక్షాలు కూడా కలసికట్టుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వివక్ష మీద పోరాడాలని కోరారు.
Tags:    

Similar News