చిన్నమ్మ విధేయులపై స్టాలిన్ టార్గెట్

Update: 2016-12-23 06:58 GMT
దేశంలోని రాజకీయాలు ఒకరకంగా సాగితే.. తమిళనాడులో అందుకు భిన్నంగా సాగుతుంటాయి. వ్యక్తిపూజకు పరాకాష్ఠగా నిలిచేలా ఉండే తమిళ రాజకీయాలు.. అమ్మ మరణంతో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అమ్మ స్థానాన్ని చిన్నమ్మ (శశికళ) భర్తీ చేసేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మ చేపట్టిన పార్టీ ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టేందుకు చిన్మమ్మ పావులు కదుపుతున్న వేళ.. అందుకు తగ్గట్లే పార్టీ నేతలు చిన్నమ్మ కరుణ కోసం బారులు తీరుతున్నారు.

మిగిలిన వారి మాదిరే..ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సైతం ప్రతిరోజూ చిన్నమ్మ దర్శనం చేసుకుంటున్నారు. అమ్మకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ సీఎం బాధత్యలు చేపట్టే ఆయన.. అమ్మ మరణం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. విధేయతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. అమ్మ మరణం తర్వాత కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. చిన్నమ్మ చొరవపై పన్నీరు సెల్వం అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నా.. పైకి మాత్రం ఎవరూ వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. అమ్మ బతికున్నప్పుడు పన్నీరు సెల్వం విధేయతతో పాటు.. ఈ తరహా అంశాల మీద ప్రశ్నించని విపక్షనేత స్టాలిన్ తాజాగా మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు రాసిన లేఖలో.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు చిన్నమ్మ (శశికళ)ను కలుస్తున్నారంటూ అబ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో లేని వ్యక్తుల్ని వీసీలు ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. స్టాలిన్ రాసిన లేఖ నేపథ్యంలో చిన్నమ్మను కలిసి తమ విధేయతను ప్రదర్శించుకునే తీరుపై పలువురు పునరాలోచనలో పడే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఇదంతా గవర్నర్ స్పందనకు అనుగుణంగా ఉంటుందని చెప్పొచ్చు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News