పెద్ద‌నోట్ల ర‌ద్దు ఎపిసోడ్ లో ఊహించ‌లేని నిజ‌మిది

Update: 2017-07-13 04:56 GMT
మ‌రో నాలుగు నెల‌లు అయితే.. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోడీ తీసుకున్న నిర్ణ‌యానికి ఏడాది పూర్తి అవుతుంది. పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర ఉన్న రూ.500.. రూ.1000 నోట్ల‌ను బ్యాంకుల ద్వారా రిజ‌ర్వ్ బ్యాంకుకు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. మ‌రింత కాలం అయ్యాక కూడా..ర‌ద్దు అయిన పెద్ద నోట్లు ఎంత మేర తిరిగి వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని ఆర్ బీఐ చెప్ప‌లేక‌పోతోంది.

ర‌ద్దు అయిన నోట్ల లెక్క ఇంకా తేల‌క‌పోవ‌టం ఏమిట‌న్న సందేహం క‌ల‌గొచ్చు కానీ.. ఇది నిజ‌మ‌న్న విష‌యం తాజాగా ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ర‌ద్దు అనంత‌రం ప్ర‌జ‌లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఇంకా లెక్కిస్తున్నామ‌ని ఆయ‌న తాజాగా చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై ఏర్పాటు చేసిన క‌మిటీ ముందు రెండోసారి హాజ‌ర‌య్యారు ఉర్జిత్ ప‌టేల్‌. ఈ సంద‌ర్భంగా క‌మిటీ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బదులిచ్చే క్ర‌మంలో ఆయ‌నీ ఆస‌క్తిక‌ర అంశాన్ని బ‌య‌ట‌పెట్టారు.

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఎంత డ‌బ్బు వ్య‌వస్థ నుంచి తిరిగి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని లెక్క తేల్చే ప్ర‌క్రియ పూర్తి కాలేద‌ని.. ఆర్ బీఐ సిబ్బంది ఈ ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నార‌న్నారు. ఆర్ బీఐ ప్ర‌త్యేక బృందం రోజుకు 24 గంట‌లూ ఆ నోట్ల‌ను లెక్కిస్తోంద‌ని.. శ‌నివారంతో పాటు చాలా సెల‌వుల్ని త‌గ్గించామ‌ని.. ఆదివారం మాత్ర‌మే సెల‌వు ఇస్తున్నామ‌ని క‌మిటీకి చెప్పినట్లుగా స‌మాచారం.

ఇంత చేసినా.. ర‌ద్దు అయిన నోట్లు ఎంత‌మొత్తం తిరిగి వ‌చ్చింద‌న్న విష‌యంపై ఇంకా లెక్క‌పూర్తి కాలేదని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ర‌ద్దు అయిన నోట్ల‌ను లెక్కించేందుకు వీలుగా కొత్త కౌంటింగ్ యంత్రాల కోసం టెండ‌ర్లు పిలిచిన‌ట్లుగా ఉర్జిత్ వెల్ల‌డించారు. మూడు గంట‌ల పాటు జ‌రిగిన స‌మావేశంలో.. పార్ల‌మెంటు క‌మిటీ స‌భ్యులు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ స‌మాధానాలు ఇచ్చారు. పెద్ద నోట్లు ర‌ద్దు కాక ముందు దేశంలో రూ.17.7 ల‌క్ష‌ల కోట్ల మొత్తం మార్కెట్లో ఉంద‌ని.. ఇప్పుడు రూ.15.4 ల‌క్ష‌ల కోట్ల మొత్తం ఉంద‌ని ఉర్జిత్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ర‌ద్దు అనంత‌రం చ‌లామ‌ణిలోకి వ‌చ్చిన డ‌బ్బుపై ఉర్జిత్ క‌చ్ఛిత‌మైన స‌మాచారాన్ని ఇవ్వ‌క‌పోవ‌టాన్ని క‌మిటీ స‌భ్యులు అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమిటంటే.. జ‌న‌వ‌రిలో ఇదే క‌మిటీ భేటీ అయిన‌ప్పుడు క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌ల్ని సంధించిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తాజా మీటింగ్ లో మాత్రం ఎలాంటి ప్ర‌శ్న‌లూ అడ‌గ‌లేద‌ని చెబుతున్నారు. ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్‌ను ఇరుకున పెట్టేలా కొంద‌రు స‌భ్యులు ప్ర‌శ్న‌లు సంధించినా.. క‌మిటీకి ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న వీర‌ప్ప మొయిలీతో పాటు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేలు జోక్యం చేసుకొని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతోంది.మ‌రీ లెక్క‌న ర‌ద్దు చేసిన పెద్ద నోట్లు ఎన్ని ఆర్ బీఐకి చేరాయ‌న్న  విష‌యం ఎప్ప‌టికి లెక్క తేలేను?
Tags:    

Similar News