నిర్మల బడ్జెట్.. ఆ ఐటీ కంపెనీకి 30 వేలకోట్ల నష్టం!

Update: 2019-07-06 05:24 GMT
నిర్మల సీతారామన్ బడ్జెట్ స్టాక్ మార్కెట్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. బడ్జెట్ లో తీసుకొచ్చిన నూతన నిబంధనలు - మార్కెట్ కు ప్రోత్సహకాలు ఏమీ లేకపోవడంతో సెన్సెక్స్ భారీగా పతనం అయ్యింది. ఎంతలా అంటే.. అలా బడ్జెట్ ప్రకటన పూర్తి అయ్యిందో లేదో.. ఇన్వెస్టర్ల సంపదన రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆవిరి అయ్యింది!

కొన్ని గంటల్లోనే మార్కెట్ లో అలా సంపద ఆవిరి అయిపోయిందంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏ స్థాయిలో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

ఒకవైపు ఈ బడ్జెట్ సామాన్యులను ఉద్ధరించినది ఏమీ లేదు. సామాన్యులను మరింతగా పన్నులతో బాదుతున్నట్టుగా ప్రకటించారు బడ్జెట్లో. మరోవైపు పెట్టుబడిదారులను కూడా ఈ బడ్జెట్ నిండా ముంచేయడం విశేషం.

స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీల్లో పబ్లిక్ హోల్డింగ్ ను ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు  శాతానికి పెంచే నిబంధన మార్కెట్ పై తీవ్ర ప్రతికూలంగా మారిందని నిపుణులు అంటున్నారు. ఈ నిబంధన అనేక కంపెనీలను దెబ్బ తీస్తోందని చెబుతున్నారు. బడ్జెట్ ప్రకటనలో ఈ నిబంధనను పేర్కొనడంలో టీసీఎస్ మార్కెట్ విలువలో భారీ పతనం నమోదు అయ్యింది. ఆ సంస్థ మార్కెట్  వ్యాల్యూ ఒక్క సారిగా ముప్పై వేల కోట్ల రూపాయల మేర తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది.

టీసీఎస్ లో టాటా సన్స్ మెజారిటీ షేర్ హోల్డర్లు. డెబ్బై రెండు  శాతం వాటా వారి చేతిల్లోనే  ఉంది. కొత్త నిబంధన ప్రకారం  వారు మరో ఏడు శాతం వాటాను బలవంతంగా అమ్మాల్సి వస్తుందట.  ఈ నిబంధనతో టీసీఎస్  మాత్రమే కాకుండా చాలా లిస్టెడ్ కంపెనీలు ఇబ్బందులు పడనున్నాయని  తెలుస్తోంది.  దీంతో కొన్ని  కంపెనీలు భారత స్టాక్ మార్కెట్ లిస్టెడ్  జాబితా నుంచి బయటకు రావడానికి కూడా వెనుకాడవనే  విశ్లేషణలు  వినిపిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News