ఆ నర హంతకుడికి హెచ్ సీయూలో మీటింగ్

Update: 2016-07-18 04:50 GMT
స్వేచ్ఛ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. దీనికి కొందరు మేధావులు వంత పాడటం లాంటివి మనం చూస్తున్నదే. మరే ప్రజాస్వామ్య దేశంలో సాధ్యం కాని కొన్ని పనులు మన దేశంలోనే సాధ్యమవుతాయి. దేశాన్ని అస్థిరం చేసే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వర్తించే వారిని వీరులుగా.. పోరాట యోధులుగా కీర్తించటం మనకు మాత్రమే చెల్లుతుందేమో. వివాదాస్పద కార్యక్రమాల్ని నిర్వహిస్తూ క్యాంపస్ లను కలుషితం చేసే వైఖరిని ఈ మధ్య కాలంలో చూస్తున్నదే. అదేమంటే.. విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛగా తమ వాదనల్ని వినిపించేందుకు నెలవులుగా కొందరు మేధావులు చేసే వాదనలు చివరకు ఏ స్థాయికి వెళుతున్నాయన్నది తాజా పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమవుతాయి.

తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక వివాదాస్పద ర్యాలీని నిర్వహించారు. ఏమిటా ర్యాలీ అని చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒకింత షాక్ కు గురి కావాల్సిందే. ఎందుకంటే.. రాజకీయ పార్టీలు సైతం తమ మద్దతును ప్రకటించిన కాశ్మీరీ ఉగ్రవాది బుర్హాన్ వనీకు అనుకూలంగా ఓ విద్యార్థి సంఘం సమావేశాన్ని నిర్వహించింది. భారత సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాదికి అనుకూలంగా కొందరు విద్యార్థులు నినాదాలు చేయటంతో పాటు..  బుర్హాన్ ఎన్ కౌంటర్ అన్యాయం అంటూ ఖండించటం గమనార్హం. శనివారం రాత్రి జరిగినట్లుగా చెబుతున్న ఈ సమావేశం నేపథ్యంలో.. దీన్ని వ్యతిరేకిస్తూ మరో విద్యార్థి సంఘం నిరసన ర్యాలీని చేపట్టింది.

అయితే.. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు మరో విద్యార్థి సంఘం ప్రయత్నించటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలైన పరిస్థితి. స్వేచ్ఛగా తమ భావాల్ని తెలుపుకోవటంలో తప్పు లేదంటూ చెప్పే మేధావులు.. ఉగ్రవాదికి అనుకూలంగా మీటింగ్ నిర్వహించటం.. నినాదాలు చేయటాన్ని కూడా సమర్థిస్తారా? తాము చెప్పే స్వేచ్ఛా వాదం నిజమైనదే అయితే.. ఉగ్రవాదికి అనుకూలంగా ఏర్పాటు చేసిన మీటింగ్ ను వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకోవటంలో అర్థం ఏమిటి? వారు ర్యాలీ నిర్వహించకూడదని కోరుకోవటం ఏమిటి? ఇదేనా స్వేచ్ఛావాదం అంటే..? అయినా.. క్యాంపస్ లలో ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదికి అనుకూలంగా సమావేశాలు జరగటం ఏమిటి..?
Tags:    

Similar News