దిన‌క‌ర‌న్‌ దే విజ‌య‌మంటున్న బీజేపీ ఎంపీ

Update: 2017-12-21 14:15 GMT
దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఆర్కేనగర్ నియోజకవర్గం కోసం ఇవాళ జరిగిన ఉప ఎన్నిక ముగిసింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం వల్ల ఆర్కేనగర్‌కు ఉప ఎన్నిక నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.29 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. అన్నాడీఎంకే - డీఎంకే - బీజేపీ ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

తమిళనాడులో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అదే రీతిలో ట్విట్ట‌ర్‌ లో కూడా స్పందించారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే బహిష్కృత నేత - చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గానికి చెందిన దినకరన్‌ దే విజయమని ఆయ‌న‌ జోస్యం చెప్పారు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధనన్‌ - డీఎంకే అభ్యర్థి మరుధుగ‌ణేష్‌ లు గెలిచే ప్రసక్తే లేదని బుధ‌వారం వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా సీఎం ప‌ళ‌నిస్వామి - డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం త‌ర‌ఫున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థి అసలు రేసులోనే లేరని కుండబద్దలు కొట్టారు.

`ఈ ఎన్నికల్లో డీఎంకే కు - దినకరన్‌ మధ్య పోటీ ఉందని నేను నమ్ముతున్నా. డీఎంకే హిట్లర్ పార్టీగా అభివర్ణించారు. అవినీతి - నేర కార్యకలాపాలతో తమిళ ప్రజలను డీఎంకే మోసం చేసింది. తమిళ ప్రజలను అవినీతి , నేరాల నుంచి కాపాడటంలో విఫలమైంది. టీటీవీ దినకరన్‌ మాత్రమే తమిళ ప్రజలను కాపాడగలడు` దీనికి కొనసాగింపుగా తాజాగా మ‌రో ట్వీట్ చేశారు. తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌కారం దినకరన్‌కు 37 శాతం ఓట్లు వస్తాయని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అంచనా వేశారు. ఇది మంచి వార్త అని కూడా ఆయ‌న అందులో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉండ‌గా... వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 12న ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఈసీ మొదట్లో తేదీని ప్రకటించింది. కానీ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు రావడంతో తేదీని వాయిదావేశారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నవంబర్ 24వ తేదీన ఎన్నికల సంఘం కొత్త తేదీని ప్రకటించింది. గత 40 ఏళ్లలో అన్నాడీఎంకే పార్టీ ఈ స్థానం నుంచి11 సార్లు పోటీపడితే.. అందులో ఏడు సార్లు నెగ్గింది. ఈ సారి 145 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కేవలం 72 మంది నామినేషన్లను మాత్రమే ఈసీ స్వీకరించింది.

Tags:    

Similar News