బాలినేనిలో బాధ పోలేదుగా.... ?

Update: 2022-04-29 07:32 GMT
వైసీసీలో సీనియర్ నేత. పార్టీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు, ఈ రోజు వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతుగా ఎంతో కృషి చేసిన నేత అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలో ఇంకా బాధ అలాగే ఉందా. అది ఎప్పటికీ అలాగే ఉంటుందా. ఇదే ఇపుడు చర్చగా ఉంది.  

వైసీపీ సర్కార్ లో బాలినేనిని సగం పాలనకే మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయన తాను ఏం పాపం చేశానని మధన పడ్డారు, తీవ్రంగా కలత చెందారు, అలాగే ఆయన అనుచరులు అయితే అధినాయకత్వం మీదనే తిరగబడ్డారు. మొత్తానికి కొన్ని రోజుల పాటు అగ్గి రాజేసిన బాలినేని ఎపిసోడ్ తరువాత సద్దుమణిగింది.

సీఎం జగన్ని కలసి వచ్చిన తరువాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ పదవి పొయినప్పటికీ  తానేమీ బాధపడడంలేదని చెప్పారు. మళ్లీ జగన్ని సీఎం చేయడమే తమ ముందున్న టార్గెట్ అని కూడా స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను నూటికి నూరు శాతం పనిచేస్తాను అని అన్నారు. ఇక బాలినేనికి తాజాగా వైసిపీలో రీజనల్ కో ఆర్డినేటర్ పదవి దక్కింది. అయితే లేటెస్ట్ గా బాలినేని మీడియాతో మాట్లాడిన మాటల్లో తేడా అయితే కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో జగన్ని సీఎం చేయాల్సింది వాలంటీర్లు మాత్రమే అని ఆయన అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. పార్టీకి ఎంతో మంది పెద్దలు ఉండగా వాలంటీర్లు జగన్ని ఎలా సీఎం ని చేస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక తన మంత్రి పదవి పోవడానికి కారణం తాను జగన్ కి బంధువు కావడమే అని కూడా ఆయన అంటున్నారు. తనను ముందు పెట్టి చాలా మంది పదవులు జగన్ తీసేశారని ఆయన చెప్పడం ద్వారా తాను బలి అయ్యాను అన్న బాధ  అయితే ఇండైరెక్ట్ గా వ్యక్తం చేయడం కనిపించింది.

ఇంకో వైపు చూస్తే పార్టీ అంతా కష్టపడి మళ్ళీ వైసీపీని పవర్ లోకి తేవాలని జగన్ ఆదేశించారు. కానీ అధినేత చెప్పిన రోజు వ్యవధిలోనే అది తమ పని కాదు వాలంటీర్లది అన్నట్లుగా బాలినేని ఇచ్చిన బోల్డ్  స్టేట్మెంట్ చూస్తే ఈ సీనియర్ నేతలో అసంతృప్తి అలాగే ఉంది అని అర్ధమవుతోంది అంటున్నారు.

మరి బాలినేని కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఆయనలో పూర్వపు ఉత్సాహం అయితే కనిపించడంలేదు అని అంటున్నారు. ఇదే తీరున మిగిలిన సీనియర్లు కూడా ఉంటే వైసీపీ పరిస్థితి 2024 లో ఎలా ఉంటుందో అన్న చర్చ అయితే గట్టిగానే ఉంది మరి.
Tags:    

Similar News