సుజ‌నా సుద్దులు: కంపెనీ అంటే లాభ‌మే కాదంట‌!

Update: 2016-04-08 14:04 GMT
గ‌త కొద్దిరోజులుగా త‌న మీద వ‌స్తున్న ప‌లు వార్త‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చేలా కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. మారిష‌స్ బ్యాంకు బ‌కాయిల నేప‌థ్యంలో సుజ‌నా కంపెనీ కోర్టు కేసులు ఎదుర్కొన‌టం.. కేంద్ర‌మంత్రికి ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా కోర్టుకు హాజ‌రుకావాల‌ని నాంప‌ల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయ‌టం తెలిసిందే. అయితే.. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో కోర్టుకు హాజ‌రు కాని నేప‌థ్యంలో ఆయ‌న‌కు నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో సుజ‌నాపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

దీనికి వివ‌ర‌ణ ఇచ్చేలా సుజ‌నా మాట్లాడారు. తాను మారిష‌స్ బ్యాంకు నుంచి ఎలాంటి రుణం తీసుకోలేద‌ని.. వేరే కంపెనీ తీసుకున్న రుణానికి త‌మ కంపెనీ హామీదారుగా మాత్ర‌మే ఉంద‌ని పేర్కొన్నారు. తన‌కు స‌ద‌రు కంపెనీలో ఒక్క‌శాతం కంటే త‌క్కువ వాటా ఉంద‌ని చెప్పిన సుజ‌నా.. వ్యాపారం అంటే లాభం మాత్ర‌మే కాద‌ని.. న‌ష్టం కూడా ఉంటుంద‌న్న విష‌యాన్ని మీడియా గుర్తించాల‌న్నారు.

మోసం చేయ‌టం వేరు.. బ్యాంకుల‌కు బ‌కాయిలు ఉండ‌టం వేర‌న్న విష‌యాన్ని మీడియా అర్థం చేసుకోవాల‌న్న ఆయ‌న‌.. వ్యాపారంలో ఒక్క పి(ప్రాఫిట్‌) మాత్ర‌మే ఉండ‌ద‌ని ఎల్ (లాస్‌) కూడా ఉంటుంద‌ని.. అందుకే వ్యాపారం అన్న వెంట‌నే పీఎల్ (ప్రాఫిట్ అండ్ లాస్‌) అని వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

తాను సుజ‌నా గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కుడిని మాత్రమేన‌ని.. త‌ర్వాత సంస్థ‌లో చాలామార్పులు వ‌చ్చాయ‌ని.. త‌మ సంస్థ‌లో ఐదు వేల మందికి ఉపాధి.. వంద‌ల కోట్లు ప‌న్నుల రూపంలో క‌ట్టిన విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని చెప్పారు. తాజా వివాదంతో త‌న రాజ‌కీయ జీవితం ప్ర‌భావితం కాద‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. పార్టీ అవ‌స‌రాల మేర‌కు పార్టీ అధినేత ఆదేశాల మేర‌కు తాను ప‌ని చేస్తాన‌ని సుజ‌నా స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News