ఏందీ సూపర్ ట్యూస్ డే హడావుడి..?

Update: 2016-03-01 19:30 GMT
ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో ఇప్పుడు జోరుగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. అదే.. ‘‘సూపర్ ట్యూస్ డే’’. ఇంతకీ ఈ సూపర్ ట్యూస్ డే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? మీడియా మొత్తం దీని గురించే ఎందుకు మాట్లాడుకుంటోంది? దీని ప్రభావం ఎలా ఉండనుంది? లాంటి అంశాల్లోకి వెళితే..

ఇండియాలో మంగళవారం దాదాపుగా పూర్తి అయినట్లే. ఈ కథనం రాసే సమయానికి (సాయంత్రం ఆరున్నర గంటల సమయం) మంగళవారం ముగింపులోకి వచ్చేసినట్లే. అయితే.. అమెరికన్లకు మాత్రం మంగళవారం ఉదయం (వాషింగ్టన్ డీసీ ఉదయం 8గంటలు.. ఫోనిక్స్ ఉదయం 6 గంటలు.. లాస్ ఏంజెల్స్ ఉదయం 5 గంటలు)లోకి అడుగు పెట్టారు.

ప్రతి వారం వచ్చే మంగళవారానికి.. ఈ మహా మంగళవారానికి చాలానే తేడా ఉంది. అమెరికాలోని 11 రాష్ట్రాల్లో (కొందరు 12 రాష్ట్రాలని చెబుతారు) మంగళవారం నాడు అమెరికా అధ్యక్ష పదవికి తుది పోటీలో బరిలోకి దిగాలని భావిస్తున్న డెమొక్రాట్స్ .. రిపబ్లికన్స్ అభ్యర్థుల్లో ఎవరో ఈ ఎన్నికల్ని తేల్చేయనున్నాయి. అంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముఖాముఖి పోటీ పడే అభ్యర్థుల వ్యవహారం ఈ రోజు జరిగే ఎన్నికలు తేల్చేయనున్నాయి.

ఈ కారణం చేతనే.. అమెరికన్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక.. అభ్యర్థుల విషయంలోకి వెళితే.. రిపబ్లికన్ల తరఫున డోనాల్డ్ ట్రంప్ తుది అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అదే పార్టీకి చెందిన రుబియో.. ట్రెడ్ క్రూజ్ లు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు తుది పోటీకి అభ్యర్థిగా నిలుస్తారన్నది తేలనుంది.

ఇక.. డెమొక్రాట్లకు సంబంధించి చూస్తే.. హిల్లరీ క్లింటన్.. బెర్నీ శాండర్స్ మధ్యన పోటీ తీవ్రంగా ఉంది. ఇదిలా ఉంటే.. సర్వేలు ఏం చెబుతున్నాయన్న విషయానికి వస్తే.. రిపబ్లికన్ల తరఫున ట్రంప్ కు 49 శాతం మంది మద్దతు పలుకుతున్నట్లు చెబుతుంటే.. డెమొక్రాట్లలో హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి కంటే స్వల్ప అధిక్యతతో ఉన్నారు.

ఈ రోజు జరిగే ఎన్నికల్లో రెండు పార్టీలకు చెందిన ట్రంప్.. హిల్లరీలే తుది పోటీలకు నిలవొచ్చన్న అంచనాలు భారీగా వినిపిస్తున్నాయి. ఇక.. మీడియా ఫోకస్ అంతా కూడా ట్రంప్ మీదనే ఉంది. ఎందుకంటే.. జాత్యాంహకర వ్యాఖ్యలతో పాటు.. చైనా.. భారత్.. ఇలా ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా ప్రతి దేశం మీదా తన అయిష్టతను వ్యక్తం చేయటం.. అమెరికాలో అక్రమంగా ఉన్న లక్షలాది మందిని వెనక్కి వెతికి మరీ పంపిస్తామని చెప్పటం.. ముస్లింలపై తనకున్న అక్కసును వ్యక్తం చేయటం లాంటి పనులతో ఆయనిప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

మరోవైపు.. హిల్లరీ విషయంలో ఇలాంటి వివాదాలేమీ లేవు. ఆమె.. తన పార్టీకి చెందిన ప్రత్యర్థులపై పోటీ పడుతూ ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు అత్యధికంగా 11 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరుగుతుండటంతో.. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున మెజార్టీ సాధించిన అభ్యర్థులే.. అమెరికా అధ్యక్ష పదవికి జరిగే తుది పోటీకి అర్హత సాధించటం ఖాయం కానుంది. మరి.. తుది పోటీకి సర్వేలు చెబుతున్నట్లు.. రిపబ్లికన్ల తరఫున డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారా? లేదా? అన్నది కొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసి పోతుంది. ఈ రోజుకు అమెరికన్లు ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమైందా..?
Tags:    

Similar News