స‌దావ‌ర్తిపై సుప్రీం తాజా తీర్పు ఇదే!

Update: 2017-10-06 10:53 GMT
ఏపీలో అధికార పార్టీని నానా ఇబ్బందులు పెడుతున్న స‌దావ‌ర్తి స‌త్రం భూముల విష‌యంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కాసేప‌టి క్రితం స్ప‌ష్ట‌మైన తీర్పును ఇచ్చేసింది. ఈ భూముల వ్య‌వ‌హారంపై నెల‌కొనే ఏ వివాదాలైనా ఇక‌పై తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాసనం కీల‌క తీర్పు జారీ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన స‌దావ‌ర్తి సంవ‌త్రానికి ఏపీలోనే కాకుండా త‌మిళ‌నాడులోనూ కోట్లాది రూపాయ‌లు విలువ చేసే భూములున్నాయి. ఈ భూముల‌పై క‌న్నేసిన ఓ టీడీపీ నేత‌ల‌... స‌దావ‌ర్తి స‌త్రానికి సంబంధించి త‌మిళ‌నాడు ప‌రిధిలో ఉన్న భూముల‌ను చేజిక్కించుకునేందుకు ప‌థ‌కం ర‌చించారు. టీడీపీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత‌తో పావులు క‌దిపిన స‌ద‌రు నేత‌... ప్ర‌భుత్వం ద్వారానే చాలా త‌క్కువ ధ‌ర‌కు ఆ భూముల‌ను లాగేసుకున్నారు.

అయితే ఈ విష‌యం తెలుసుకున్న గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి... చంద్ర‌బాబు స‌ర్కారుపై న్యాయ‌పోరాటానికి తెర తీశారు. కోర్టును ఆశ్ర‌యించిన ఆళ్ల‌... అతి త‌క్కువ ధ‌ర‌కే విలువైన స‌దావ‌ర్తి స‌త్రం భూములు వెళ్లిపోయిన వేలాన్ని ర‌ద్దు చేయాల‌ని తిరిగి వేలం నిర్వ‌హించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో ఈ మొత్తం వ్య‌వ‌హారంపై సుదీర్ఘ విచార‌ణ నిర్వ‌హించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టు... ఏపీ స‌ర్కారు నిర్వ‌హించిన వేలం పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌లేద‌ని తీర్మానించేసింది. అదే స‌మ‌యంలో ఈ భూముల‌ను మ‌రోమారు వేలం వేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండోసారి వేలం వేయాల‌న్న హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను అడ్డుకునేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు చివ‌రి నిమిషం దాకా య‌త్నించి విఫ‌ల‌మైంది. ఈ క్ర‌మంలో మొన్నామ‌ధ్య చెన్నైలో జ‌రిగిన రెండో వేలంలో ఈ భూముల‌కు రెట్టింపు కంటే అధిక ధ‌ర వ‌చ్చేసింది.

అయితే ఈ రెండో విడ‌త వేలానికి ముందే.. భూములు త‌మ రాష్ట్ర ప‌రిధిలో ఉన్నందున ఈ భూములు త‌మ‌వేన‌ని, ఈ కేసులో త‌మ‌ను కూడా ఇంప్లీడ్ చేసుకోవాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీం ధ‌ర్మాస‌నం ముందుగా వేలం నిర్వ‌హించాల‌ని, ఆ త‌ర్వాత ఇత‌రుల వాద‌న‌లు వింటామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో వేలం జ‌రిగిపోయిన నేప‌థ్యంలో కాసేప‌టి క్రితం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం ధ‌ర్మాస‌నం... త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ వాద‌న‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని భూములు ఎవ‌రివో తేల్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ బాధ్య‌త‌ల‌ను స‌ర్వోన్న‌త న్యాయస్థానం తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టుకే క‌ట్టబెట్టేసింది. అంతేకాకుండా స‌దావ‌ర్తికి సంబంధించి ఇంకే వివాదం అయినా హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే... స‌దావ‌ర్తి స‌త్రం ఏపీ కేంద్రంగా కొన‌సాగుతున్నదేని ఒప్పేసుకున్న త‌మిళ‌నాడు... ఆ స‌త్రం త‌మ రాష్ట్రంలో భూముల‌ను క‌లిగి ఉండ‌టాన్ని మాత్రం త‌ప్పుబ‌డుతున్న వైనం ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా స్థిరాస్తుల‌ను క‌లిగి ఉండ‌టంలో ఏ త‌ప్పూ లేదు. మ‌రి అలాంట‌ప్పుడు ఏపీకి చెందిన‌ స‌దావ‌ర్తి స‌త్రం... త‌మిళ‌నాడులో భూముల‌ను కొనుగోలు చేస్తే.. ఆ భూములు త‌మ‌వేన‌ని వాదించే హ‌క్కు త‌మిళ‌నాడుకు ఎక్కడిద‌న్న ప్ర‌శ్న ఇప్పుడు ఉద‌యిస్తోంది. మ‌రి ఈ అంశంపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News