న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఖూనీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు?

Update: 2019-02-07 05:56 GMT
దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఎప్పుడూ లేని విధంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఖూనీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న వ్యాఖ్య వ‌చ్చింది. సీబీఐ ఇన్ ఛార్జ్ డైరెక్ట‌ర్ గా ఎం నాగేశ్వ‌ర‌రావును నియ‌మిస్తూ.. నియామ‌క స‌మావేశ వివ‌రాల్ని వెల్ల‌డించ‌టంలో ప్ర‌బుత్వం సుప్రీంను త‌ప్పు దోవ ప‌ట్టించిందంటూ ప్ర‌శాంత్ భూష‌న్ ట్వీట్లు చేయ‌టం తెలిసిందే.

ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు అభ్యంత‌రం చెబుతూ ఏజీ వేణుగోపాల్ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని వేశారు. దీనికి సంబంధించిన విచార‌ణ తాజాగా సుప్రీంకోర్టులో జ‌రుగుతోంది. దీనిపై స్పందించిన సుప్రీం.. ప్ర‌శాంత్ భూష‌ణ్ కు నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది.

విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం కాసింత ఘాటుగా స్పందించింది. బాధ్య‌త‌గా ప‌ని చేసే వారికి స్వేచ్ఛ ల‌భిస్తుంది. న్యాయ వ్య‌వ‌స్థ‌నే ముట్టుబెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తే ఇక చెప్పేదేముంది? అన్న క్వ‌శ్చ‌న్ వేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే అలానే క‌నిపిస్తుంద‌న్న కోర్టు.. న్యాయ‌వ్య‌వ‌స్థ భ‌ద్ర‌త‌కు అంత‌ర్గ‌తంగా కాకుండా వెలుప‌ల నుంచి స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని పేర్కొంది.

న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఖూనీ చేసేందుకు కొంత‌మంది న్యాయ‌వాదులు క‌త్తిని చేత ప‌ట్టుకొని తిరుగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్న కోర్టు వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లోకి వ‌చ్చిన ప్ర‌ముఖుడు ప్ర‌శాంత్ భూష‌ణ్ సైతం న్యాయ‌వాది కావ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. ఇటీవ‌ల కాలంలో సుప్రీంకోర్టు ఇంత ఘాటుగా రియాక్ట్ కావ‌టం ఇదే తొలిసారిగా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News