స‌దావ‌ర్తి అప్‌ డేట్‌!..వేలం వాయిదా చెల్ల‌దు!

Update: 2017-09-12 10:56 GMT
ఏపీలో పెద్ద వివాదాన్నే రేపిన స‌దావ‌ర్తి స‌త్రం భూముల విష‌యంపై వైసీపీ ఫైర్ బ్రాండ్‌, గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చేస్తున్న వాద‌న‌లో నిజ‌ముంద‌ని మ‌రోమారు తేలిపోయింది. చంద్ర‌బాబు స‌ర్కారు స‌ద‌రు భూముల‌ను కారు చౌక‌గా త‌న‌కు అనుకూలంగా ఉన్న వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెడుతున్న వైనంపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేకెత్తాయి. దీంతో దిగొచ్చిన చంద్ర‌బాబు స‌ర్కారు... గ‌తంలో ఈ భూముల‌ను తీసుకున్న వ్య‌క్తి నుంచి భూముల‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. కోట్లాది రూపాయ‌ల విలువైన ఈ భూముల‌ను టీడీపీ స‌ర్కారు త‌న అనుకూలుర‌కు క‌ట్ట‌బెట్టేందుకు పెద్ద తతంగాన్నే న‌డిపింద‌ని ఆళ్ల కోర్టుకెక్కిన విష‌యం తెలిసిందే.

ఆళ్ల వాద‌న‌లోని నిజాన్ని గ్ర‌హించిన కోర్టు... బాబు స‌ర్కారుకు చీవాట్లు పెట్టి మ‌రీ ఆ భూముల‌కు తిరిగి వేలం నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో న‌డిచిన పెద్ద తంతులో ప్ర‌భుత్వం ఈ భూముల‌ను అమ్మిన ధ‌ర కంటే... మ‌రో రూ.5 కోట్లు ఎక్కువ చెల్లించేందుకు కూడా సిద్ధ‌మేన‌ని ఆళ్ల పిటిష‌న్ వేసి మ‌రీ బాబు స‌ర్కారు భండారాన్ని బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేర‌కు ఆళ్ల ఇప్ప‌టికే నిర్దేశిత మొత్తాన్ని ప్ర‌భుత్వం వ‌ద్ద జ‌మ చేశారు. త‌మిళ‌నాడులోని చెంగ‌ల్ప‌ట్టు ప‌రిస‌రాల్లో ఉన్న ఈ భూముల‌కు ఇక వేల‌మే త‌రువాయి అన్న త‌రుణంలో స‌ద‌రు వేలాన్ని వాయిదా వేయాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు య‌త్నించింది.

ఇటు చంద్ర‌బాబు స‌ర్కారుతో పాటు అటు ఆళ్ల పిటిష‌న్ల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కిన సంజీవ‌రెడ్డి మొత్తం వ్య‌వ‌హారంపై దృష్టి సారించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. సంజీవ‌రెడ్డి పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం ధ‌ర్మాస‌నం... వేలం వాయిదా కుద‌ర‌నే కుద‌ర‌దంటూ బాబు స‌ర్కారుకు మొట్టికాయ వేసింది. హైకోర్టు నిర్ణ‌యం మేర‌కు స‌దావ‌ర్తి భూముల వేలాన్ని ఈ నెల 14 నిర్వ‌హించి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ఈ వేలంలో ఆళ్ల కూడా పాల్గొనాల్సిందేన‌ని చెప్పిన కోర్టు... ఆళ్ల గైర్హాజ‌రైతే ఆయ‌న ప్ర‌భుత్వం వ‌ద్ద డిపాజిట్ చేసిన రూ.10 కోట్ల‌ను జప్తు చేస్తామ‌ని కూడా చెప్పింది. వెర‌సి... ఎల్లుండి జ‌ర‌గ‌నున్న ఈ వేలాన్ని ఎలా వాయిదా వేయాలంటూ అందుబాటులో ఉన్న అన్ని అంశాల‌ను ప‌రిశీలిస్తున్న చంద్రబాబు స‌ర్కారుకు సుప్రీంకోర్టు తీర్పుతో ఇక్క‌ట్లు త‌ప్పేలా లేవ‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News