అంబానీ బ్ర‌ద‌ర్స్ కు సుప్రీం షాక్‌..న‌ష్టాల్లో షేర్లు

Update: 2018-03-22 11:33 GMT
త‌మ్ముడ్ని ఆదుకునేందుకు అన్న రావ‌టం సినిమాల్లో చూస్తుంటాం. ఇంచుమించు ఇదే సీన్ రియ‌ల్ లైఫ్ లోనూ అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటుంది. దేశంలోనే అత్యంత సంప‌న్నుల ఇంటి పంచాయితీ విష‌యంపై సుప్రీం జారీ చేసిన ఆదేశాలు ఆ రెండు కుటుంబాల‌తో పాటు.. షేర్ మార్కెట్ సైతం ప్ర‌భావిత‌మైంది. గ‌తంలో చోటు చేసుకున్న గొడ‌వ‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టి.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న త‌మ్ముడు అనిల్ అంబానీని ఆదుకునేలా అన్న ముకేశ్ అంబానీ స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకురావ‌టం తెలిసిందే.

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్ ఆస్తుల్ని జియోకు అమ్మే అంశంపై రెండు కంపెనీల మ‌ధ్య జ‌రిగిన డీల్ పై కోర్టు స్టే విధించింది. దీన్ని ఎత్తివేయాల‌ని రెండు కంపెనీలు సుప్రీంను కోరాయి. తాజాగా దీనిపై ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. స్టేను ఎత్తేయ‌టానికి నో చెప్పింది. త‌న త‌దుప‌రి ఆదేశాలు జారీ చేసే వ‌ర‌కూ.. ఇప్పుడున్న య‌థాత‌ధ స్థితిని కొన‌సాగించాల‌ని పేర్కొంది. అంతేకాదు.. త‌న అనుమ‌తి లేనిదే డీల్ క్లోజ్ చేయ‌టం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. అనిల్ అంబానీ కంపెనీకి ఉన్న రుణ‌భారంలో రూ.39 వేల కోట్ల మేర త‌గ్గించుకునే వ్యూహంలో భాగంగా త‌న వైర్ లెస్ స్పెక్ట్రం.. ఫైబ‌ర్ మీడియా క‌న్వ‌ర్జెన్స్ నోడ్ ఆస్తుల‌ను జియోకు విక్ర‌యించనున్న‌ట్లు ఆర్ కాం ప్ర‌క‌టించింది. అయితే.. ట్రిబ్యున‌ల్ ఆర్డ‌ర్ కు భిన్నంగా ముంద‌స్తు అనుమ‌తి లేకుండా ఆస్తుల విక్ర‌యం లేదంటే.. బ‌దిలీ సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేస్తూ.. ముంబ‌యి హైకోర్టు డీల్ ను రిజెక్ట్ చేసింది

దీనిపై సుప్రీంను ఆశ్ర‌యించిన ఆర్ కామ్‌.. ఆస్తుల అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన కోర్టు.. ముంబ‌యి కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేసేందుకు నో చెప్పింది. తాజాగా కోర్టు తీర్పు ప్ర‌తికూలంగా ఉండ‌టంతో రిల‌య‌న్స్ షేర్లు ప‌త‌నాన్ని న‌మోదు చేసింది. దీంతో.. మార్కెట్ సైతం ప్ర‌భావిత‌మై న‌ష్టాల్ని మూట‌గ‌ట్టుకుంది. త‌మ సంప‌ద‌తో దేశాన్ని ప్ర‌భావితం చేసే అంబానీలు ఎంత శ‌క్తివంతుల‌న్న‌ది తాజా ఉదాహ‌ర‌ణ చెప్ప‌కనే చెప్పింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News