నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ సర్కార్ కు సుప్రీం షాక్

Update: 2020-06-10 07:50 GMT
ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది.  నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలంటూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేయకుండా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఎక్కింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది.

ఏపీ ప్రభుత్వ పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి బోబ్డే - జస్టిస్ బోపన్న - జస్టిస్ హృషికేష్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలతో ఆటలు ఆడటం తగదని హెచ్చరించింది. ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను తొలగించారు. ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. తాజాగా సుప్రీం కోర్టు కూడా నిమ్మగడ్డకే అనుకూలంగా తీర్పునివ్వడంతో తిరిగి ఆయనే ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకం కానున్నారు. ఈ పరిణామం ఏపీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News