సుప్రీం క్వ‌శ్చ‌న్‌!..గో ర‌క్ష‌ణ పేరుతో హ‌త్య‌లా?

Update: 2017-09-06 11:37 GMT
గ‌త కొన్నాళ్లుగా దేశంలో ఆవుల సంర‌క్ష‌ణ పేరిట జ‌రుగుతున్న ఆగ‌డాల‌పై సుప్రీం కోర్టు సీరియ‌స్ అయింది. ఇలాంటి చ‌ర్య‌ల‌ను ఎప్ప‌టికీ స‌హించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి వారిని చూస్తూ ఊరుకుంటే మ‌రింత రెచ్చిపోతార‌ని హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలో అన్ని రాష్ట్రాల‌కూ ఆదేశాలు జారీ చేసింది. బుధ‌వారం ఈ పిటిష‌న్‌ పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు.. గోర‌క్ష‌కులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు చెక్‌ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ ఫోర్స్‌ లను ఏర్పాటుచేయాలని  ఆదేశించింది.

గుజ‌రాత్‌ - రాజ‌స్థాన్‌ - హైద‌రాబాద్‌ - యూపీలోని ముజ‌ఫ‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో గో సంర‌క్ష‌ణ పేరుతో కొంద‌రు యువ‌కుల‌ను న‌డిరోడ్డుపై కొట్ట‌డం - తిట్ట‌డం - క‌త్తుల‌తో బెదిరించ‌డం కొన్ని చోట్ల హ‌త్య‌లు చేయ‌డం కూడా జ‌రిగింది. ఇవ‌న్నీ ఆయా ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్‌ ఎస్‌ పూనావాలా గత ఏడాది అక్టోబర్‌ 21న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఈ పిటిషన్‌ ను విచారించిన సుప్రీంకోర్టు.. దీనిపై స్పందన తెలియజేయాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.

ఈ క్ర‌మంలోనే బుధ‌వారం తీర్పు చెబుతూ.. గో రక్ష‌ణ చేయాల్సిందేన‌ని, అయితే, వాటి పేరుతో హింస జ‌రిగితే ఉపేక్షించేది లేద‌ని తేల్చి చెప్పింది. కేవ‌లం వారం రోజుల్లోనే వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ఆదేశించింది. ఏడు రోజుల్లోనే టాస్క్ పోర్సును ఏర్పాటు చేసి.. దాడుల‌కు చెక్ పెట్టాల‌ని హుకుం జారీ చేసింది. సీనియర్‌ పోలీసు అధికారిని నోడల్‌ ఆఫీసర్‌ గా నియమించాల‌ని సూచించింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాద‌ని, అలా తీసుకుంటే ఎవ‌రు ఎంత‌టి వారైనా ఉపేక్షించవద్దని రాష్ట్రాలను ఆదేశించింది.
Tags:    

Similar News