జాతీయ ఎమర్జెన్సీ : కరోనా పై కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం షోకాజ్ !

Update: 2021-04-23 07:15 GMT
దేశంలో సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో  ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాల తీరుపై కోర్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, అధికారయంత్రాంగాన్ని మందలిస్తుండడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. స్వచ్ఛందంగా తాము ఓ కేసు చేపడుతున్నట్లు ప్రకటించి, ఇది జాతీయ ఎమర్జెన్సీ అనీ, దీన్ని ఎదుర్కొనడానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని కేంద్రానికి స్పష్టం చేసింది. ఆక్సిజన్‌, మందుల కొరత, వ్యాక్సినేషన్‌ మొదలైన అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఏడు రాష్ట్రాల్లో హైకోర్టులు తీవ్రంగా ఆక్షేపించాయి.  దీనితో సుప్రీంకోర్టు అన్ని ముఖ్యమైన కరోనా సంబంధ కేసులనూ తనకే బదలాయించుకోవాలని తొలుత భావించింది. రకరకాల కోర్టులు, విభిన్న ప్రాధాన్యాలు ఉన్న దృష్ట్యా ఉమ్మడిగా, అందరికీ వర్తించే ఉత్తర్వులను తామెందుకు జారీ చేయకూడదో కారణాలను  చెప్పాలని అటు కేంద్రాన్ని, వివిధ హైకోర్టులను ఆశ్రయించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీచేసింది.

దేశంలో పరిస్థితి పరిగణనలోకి తీసుకుంటూ తనంత తానుగా చేపట్టిన కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్‌ ఓ జాతీయ అత్యవసర స్థితి అని అభివర్ణిస్తూ దీన్ని ఎదుర్కోడానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని కేంద్రానికి సూటిగా స్పష్టంచేసింది.  ప్రధానంగా ఆక్సిజన్‌, రెమ్ ‌డెసివిర్‌ సహా ఇతర అత్యవసర ఔషధాల సరఫరా, వ్యాక్సినేషన్‌ విధానం, లాక్ ‌డౌన్‌ ప్రకటనకు రాష్ట్రాలకున్న అధికారం నేడు విచారణ చేయనుంది.  ఈ కేసులో కోర్టుకు సహాయకుడిగా సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వేను నియమించింది. బాంబే, కలకత్తా, ఢిల్లీ, అలహాబాద్‌, సిక్కిం, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ హైకోర్టులు కొవిడ్‌ సంబంధ కేసులపై విచారణ జరుపుతున్నాయి. ఇవి ఒక్కోసారి గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఒక హైకోర్టు ఒక అంశంపై ఓ ఉత్తర్వు ఇస్తే మరో హైకోర్టు అందుకు భిన్నంగా తీర్పిస్తోంది. అందుకే.. స్వచ్ఛందంగా దీన్ని ఓ కేసుగా విచారిస్తాం అని జస్టిస్‌ బోబ్డే వివరించారు.  శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే చివరగా చేపట్టిన కీలక కేసు ఇదే కావడం గమనార్హం.

వైరస్‌ సోకిన వారికి అందించే చికిత్సలో మెడికల్‌ ఆక్సిజన్‌ కూడా ఓ భాగం. వీటిని సమరీతిన పంపిణీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకునేందుకు ఓ సమన్వయ సంస్థ ఏర్పాటు అవసరం. వీటిని రాష్ట్రాల మధ్య, ఒక రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతాలకు చేరవేసే విషయంలో ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి పరిష్కరించాలి. దీనిపై కేంద్రం స్పందించాలి అని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు వరుసగా రెండోరోజూ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బహుశా ఈ దేశాన్ని దేవుడే నడిపిస్తున్నాడేమో అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. కేంద్రం తలుచుకుంటే స్వర్గాన్ని కూడా భూమిపైకి దింపగలదు అని కామెంట్‌ చేసింది. దేశ రాజధానిలో కొవిడ్‌ రోగుల చికిత్సకు బెడ్స్‌ దొరకకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సామాన్యుల సంగతి అటుంచితే, కనీసం నేను బెడ్‌ కావాలని అడిగినా ఇచ్చే దిక్కులేదు అని జస్టిస్‌ విపిన్‌ సంఘీ తప్పుబట్టారు.
Tags:    

Similar News