హుజూరాబాద్‌పై సురేఖ.. కొత్త మెలిక‌.. ఏమ‌న్నారంటే!

Update: 2021-09-09 11:20 GMT
తెలంగాణ పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌, మాజీ మంత్రి కొండా సురేఖ‌.. మ‌రోసారి త‌న పంతం నెగ్గించుకునేందు కు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ త‌ర్వాత‌.. వైసీపీ.. త‌ర్వాత టీఆర్ ఎస్ ఇలా.. అనేక పార్టీల్లోకి జంప్ చేసిన కొండా సురేఖ దంప‌తులు ఎక్క‌డా నిల‌క‌డైన రాజ‌కీయాలు చేయ‌లేక పోయారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో గ‌ట్టి ప‌ట్టున్న‌ప్ప‌టికీ.. పార్టీలు మార‌డం.. ఎక్క‌డ ఉన్నా.. త‌మ రాజ‌కీయాల కోసం ప‌ట్టుబ‌ట్ట‌డం.. సురేఖ దంప‌తుల‌కు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

టీఆర్ ఎస్‌లో ఎదురైన అనుభ‌వాల‌తో కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన సురేఖ దంప‌తుల‌కు ఇప్పుడు అనూహ్య‌మైన అవ‌కాశం ద‌క్కింది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో సురేఖ‌కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేత‌లు రెడీ అయ్యారు. దాదాపు ఈ టికెట్ ఆమెకే ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ పోటీ చేసే వారి పేర్ల‌తో కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ కూడా సురేఖ‌కే మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఈ విష‌యంపై సురేఖ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇక్క‌డ నుంచి పోటీ చేస్తాన‌ని అంటూనే త‌న పంతం నెగ్గించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

వాస్త‌వానికి ... హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు తనను పోటీచేయాలని తమ పార్టీ నేతలు కోరుతున్నారని సురేష్ తెలిపారు. ఒకవేళ హుజురాబాద్‌లో పోటీ చేసినా మళ్లీ వరంగల్‌కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీచేస్తానని కొండా సురేఖ తెలిపారు. ఇదిలావుంటే, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 2018 శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి గణనీయమైన ఓట్లే వచ్చాయి. వాటిని నిలుపుకొంటే.. త్రిముఖ పోటీ జరిగి రేసులో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ తమ అభ్యర్థులుగా బీసీలనే బరిలోకి దించుతున్న నేపథ్యంలో బీసీ వర్గానికే చెందిన కొండా సురేఖ వంటి బలమైన నేతను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతు న్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ సామాజికవర్గమైన పద్మశాలీలు, ఆమె భర్త కొండా మురళి సామాజికవర్గమైన మున్నూరుకాపులూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ రెండు సామాజికవర్గాలకుతోడు ఇతర బీసీ సామాజికవర్గాల్లోని ఓట్లూ కలిసివస్తే తామే చాంపియన్‌గా నిలవచ్చని కాంగ్రెస్‌ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

కానీ సురేఖ మాత్రం.. త‌న‌కు ఇక్క‌డ అవ‌కాశం ఇచ్చినా.. వ‌రంగ‌ల్‌ను మాత్రం వ‌దులుకునేది లేద‌ని.. చెబుతున్నారు. అంటే.. పార్టీలో అటు వరంగ‌ల్‌, ఇటు క‌రీంన‌గ‌ర్‌.. కూడా రెండూ కొండా వ‌ర్గానికే ద‌క్కాల‌నే వ్యూహంతో ఉన్నారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి కాంగ్రెస్ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. సురేఖ రాజ‌కీయం మ‌రింత వేడెక్కిస్తోంది.






Tags:    

Similar News