ఈ సింప‌తీ.. రెండున్న‌రేళ్ల‌కు పండేనా....?

Update: 2021-11-20 11:30 GMT
రాజ‌కీయాల్లో ఉన్న‌వారు..  ఎవ‌రైనా.. పార్టీల‌కు అతీతంగానే మాట్లాడుకున్న‌ప్పుడు. వారు కోరుకునేది ఏంటి?  వారు ఏం చేసినా.. ఏం ఆశిస్తారు..?  అంటే.. ఠ‌క్కున వచ్చే ఆన్స‌ర్‌.. సింప‌తీ! వాళ్లు.. వైసీపీ అధినేత జ‌గ‌నైనా, టీడీపీ అధినేత చంద్ర‌బాబైనా..! రాజ‌కీయ నేత‌లు ఎవ‌రైనా కూడా.. సింప‌తీనే ప‌ర‌మార్ధంగా రాజ‌కీయాలు చేస్తారు. నాడు జ‌గ‌న్ పాద‌యాత్ర చేసినా.. ఒక్క‌ఛాన్స్ అని పిలుపునిచ్చినా.. జ‌గ‌న్ మాతృమూర్తి.. సోద‌రి.. ఇలా ఎవ‌రు రోడ్డెక్కినా.. దాని ప‌ర‌మార్థం.. సింప‌తీని ద‌క్కించుకోవ‌డ‌మే. త‌ద్వారా.. ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావ‌డ‌మే...! ఈ విష‌యంలో ఒక్క క‌మ్యూనిస్టు పార్టీలు త‌ప్ప‌.. మిగిలినవ‌న్నీ.. ఒకే తాను ముక్కలు.

``కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడ‌దా!`` అన్నా.. సీఎం పిల్ల‌లే సీఎంలు కావాలా? అని నిల‌దీసినా.. రాష్ట్రాన్ని కులాల కుంప‌టి చేస్త‌సున్నార‌ని..నిప్పులు చెరిగినా.. ఆయ‌న ఆర్థిక నేర‌గాడు అంటూ.. విమ‌ర్శ‌లు గుప్పించినా.. ఏం చేసినా.. ప్ర‌జ‌ల నుంచి సింప‌తీని ద‌క్కించుకోవ‌డ‌మే నాయ‌కుల ముఖ్య ల‌క్ష్యం. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇవ‌న్నీ.. ఎందుకు త‌లుచుకోవాల్సి వ‌స్తోందంటే.. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకున్నారు. నిజ‌మే కావొచ్చు.. ఆయ‌న‌లో భావోద్వేగం క‌ట్టలు తెగే ఉండొచ్చు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు.కానీ.. దీని వెనుక ప‌ర‌మార్థం ఏంటి?  పెద్ద కొండ‌ను తొలిచే చిన్న గున‌పం కూడా ప‌దునుగా ఉంటేనే ఆప‌నిచేయ‌గ‌ల‌దు. ఇది చిన్న విష‌యం. మ‌రి ఇది కూడా తెలియ‌ద‌ని అనుకోవాలా...!

ఎందుకంటే.. ఇప్పుడు చంద్ర‌బాబు ఏం చేసినా.. ఆయ‌న సింప‌తీ కోస‌మే. అస‌లు పైన చెప్పుకొన్న‌ట్టుగా.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ఏం చేసినా.. ఆఖ‌రుకు ప్ర‌జ‌ల నుంచి సానుభూతి పొంద‌డం..త ద్వారా ల‌భించే ఓట్ల‌తో అధికారంలోకి రావ‌డ‌మే. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబుక‌న్నీళ్లు దాదాపు రెండున్న‌రేళ్ల‌పాటు ఇంకిపోకుండా ఉండాలి! ఎందుకంటే.. ఇప్పుడు ఏర్ప‌డిన సింప‌తీ ఫ‌లించాలంటే.. ఓట్ల రూపంలో ఆయ‌న‌కు సింప‌తీ.. రాలాలంటే.. మ‌రో రెండున్న‌రేళ్ల వ‌ర‌కు రాష్ట్రంలో సార్వ‌త్రిక స‌మ‌రం లేదు. మ‌ధ్య‌లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేదు. అంతేకాదు.. జ‌గ‌న్ మ‌ధ్య‌లోనే త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకునే ఉద్దేశం కూడా లేదు. సో.. ఇప్పుడు ఈ చంద్ర‌బాబు క‌న్నీళ్లు.. ప్ర‌జ‌ల్లో రెండున్న‌రేళ్ల‌పాటు.. ఇంకిపోకుండా ఉండాలి.

వారు రోజూ గుర్తు  చేసుకోవాలి! మ‌రి అప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఏడుస్తూనే ఉంటారా?  లేక‌.. ఏం చేస్తారు?  అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. నిన్న జ‌రిగింది ఈ రోజు... ఈ రోజు జ‌రిగింది రేపు మ‌రిచిపోతున్న కాలంలో ఉన్నాం. ఎవ‌రి గోల వారిది! అన్న మాట వాస్త‌వం చేస్తున్న ప‌రిస్థితుల్లో జీవితాల‌ను వెళ్ల‌దీస్తున్నాం. మ‌రి చంద్ర‌బాబు కార్చిన క‌న్నీటిని రెండున్న‌రేళ్ల‌పాటు ఎలా గుర్తుపెట్టుకుంటారు?  ఎలా మ‌రిచిపోకుండా ఉంటారో.. ఈ ఏపీ ప్ర‌జ‌లుచూడాలి! కొస‌మెరుపు ఏంటంటే..తాను ఏడ్వాల్సింది ఏడ్చేసి.. మిగిలింది మీరు ఏడ్వ‌మంటూ.. చంద్ర‌బాబు హైద‌రాబాద్ వెళ్లిపోయారు!!
Tags:    

Similar News