ఓటుకు నోటు అంతిమ టార్గెట్ మారిందా?

Update: 2015-08-19 05:27 GMT
ఓటుకు నోటు వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? తొలుత అనుకున్న దానికి భిన్నంగా ఇప్పుడు అంతిమ లక్ష్యం మారిందా? అన్నది ప్రశ్నగా మారింది.

తమకు కంట్లో నలుసులా చిరాకు పుట్టిస్తున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ పని పట్టేందుకు ఉద్దేశించిన ఈ ఆపరేషన్.. తన పరిధిని మరింత పెంచుకున్నట్లుగా కనిపిస్తోంది. తొలుత టార్గెట్ రేవంత్ రెడ్డి అయినప్పటికీ.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. టీ సర్కారు చేపట్టిన టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని బయట పెట్టటమేకాదు.. తనకు తానుగా ట్యాపింగ్ చేసినట్లుగా కోర్టులో ఒప్పుకున్న నేపథ్యంలో.. టార్గెట్ మార్చినట్లుగా చెబుతున్నారు.

టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఎప్పటికైనా తెలంగాణ సర్కారుకు శిరోభారంగా మారటమే కాదు.. బలి తీసుకునే అవకాశం ఉందని.. అలాంటి పరిస్థితే వస్తే.. ‘‘కుండ మార్పిడి’’కి అవకాశం ఉండే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని.. అందులో భాగమే తాజాగా పరిణామాలుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి.

ఈ వాదనను పలువురు విభేదిస్తున్నా.. చంద్రబాబును ఈ కేసులో కీలక నిందితుడిగా మార్చే ప్రక్రియ చాప కింద నీరులా జోరుగా సాగుతోందని.. అదే లేని పక్షంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును.. ఓటుకు నోటు కేసు ఛార్జిషీట్లో 22 సార్లు ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజంగా టార్గెట్ చంద్రబాబు కాకుంటే.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును.. బలమైన ఆధారాలు లేకుండా ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని చెప్పటమే కాదు.. కేవలం ఊహాగానాలు.. ఇలా జరిగి ఉండొచ్చన్న వాదనలకు ముఖ్యమంత్రి పేరు పెట్టటం ఎంతమేర సబబు అని వాదిస్తున్నారు.

ఛార్జ్ షీట్లో 22 సార్లు.. చంద్రబాబు పేరు ప్రస్తావించటంతోనే తెలంగాణ సర్కారు వ్యూహం బయటపడిపోతుందని.. ఓటుకు నోటు కేసులో.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం.. అంతిమంగా ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చే ప్రయత్నంతోనే ఈ వ్యవహారమంతా సాగుతుందని చెబుతున్నారు. మొదట అనుకున్న అంతిమ లక్ష్యం ఇప్పుడు మారిందని చెబుతున్న వాదనకు సంబంధించిన పరిణామాలు ఎంతమేర వాస్తవం అన్నది కాలమే చెప్పాలి.

Tags:    

Similar News