తెలంగాణ‌లో టీడీఎల్పీనే లేద‌ట‌!

Update: 2017-11-02 11:08 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో రేవంత్ వ్య‌వహారం ఇంకా హాట్ హాట్‌గానే సాగుతోంది. ఆయ‌న టీడీపీకి రాజీనామా స‌మ‌ర్పించి అటు పార్టీకి, ఇటు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. అనంత‌రం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా క‌ప్పుకొని వ‌చ్చారు. అయితే, ఈ విష‌య‌మే ఇప్పుడు తెలంగాణ‌లో మంట‌లు రేపుతోంది. తెలంగాణ‌లో గ‌తంలోనూ అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేశారు. మేధావులు, సీనియ‌ర్లు అన‌ద‌గిన వారు , చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన వారు సైతం బాబుకు బై చెప్పేశారు.

అయితే, ఇలా వ‌చ్చిన వారంతా టీడీపీకి రాజీనామా చేశారే త‌ప్ప వారి ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌లేదు. ఈ క్ర‌మంలో.. రేవంత్ ఇప్పుడు అటు టీడీపీకి, ఇటు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రిజైన్ చేసేశారు. త‌న రిజైన్ లెట‌ర్‌ను తెలంగాణ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి ఇవ్వాల్సి ఉండ‌గా.. అమ‌రావ‌తి వెళ్లి.. అక్క‌డ సీఎం చంద్ర‌బాబు చేతిలో పెట్టి వ‌చ్చారు. అయితే, దీనినే రేవంత్ నేరుగా స్పీక‌ర్‌కు అప్ప‌గించి ఉంటే.. అనుమ‌తి పొందేదో లేదో తేలిపోయేది. అదేస‌మ‌యంలో అటు కాంగ్రెస్ నుంచి ఇటు టీడీపీ నుంచి పార్టీ మారి టీఆర్ ఎస్‌లోకి వ‌చ్చిన వారిని అన‌ర్హుల‌ను చేయాల‌నే డిమాండ్ కూడా మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చి ఉండేది.

ముఖ్యంగా టీడీపీ త‌ర‌ఫున స‌న‌త్‌న‌గ‌ర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌స్తుతం కేసీఆర్ టీంలో మంత్రిగా ఉన్నారు.  వాస్త‌వానికి ఈయ‌న కూడా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఎమ్మెల్యే ప‌ద‌వికి మాత్రం రాజీనామా చేయాల‌ని గ‌తంలోనే డిమాండ్లు వినిపించాయి. అప్ప‌ట్లో త‌ల‌సాని స్పందిస్తూ.. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశాన‌ని, అయితే, ఇది స్పీక‌ర్ వ‌ద్ద పెండింగ్‌లో ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌,  ఇప్పుడు.. రేవంత్ విష‌యంలో స్పీక‌ర్ రాజీనామా ఆమోదిస్తే.. త‌ల‌సానిపై నిర్ణ‌యం పెండింగ్ పెట్టేందుకు అవ‌కాశం లేదు. దీంతో ఈయ‌న రిజైన్ లెట‌ర్‌ను కూడా ఆమోదించాలి.

ఈ క్ర‌మంలోనే త‌ల‌సాని కొత్త వాద‌న తెర‌మీద‌కి తెచ్చారు. రాష్ట్రంలో టీడీఎల్పీ లేనేలేద‌ని తాజాగా వ్యాఖ్యానించారు.   ``ఇప్పుడు నా రాజీనామా విష‌యం తెర‌మీద‌కి వ‌చ్చే అవ‌కాశ‌మేలేదు. ఎందుకంటే.. రాష్ట్రంలో టీడీఎల్పీ.. నేత‌గా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు దానిని టీఆర్ ఎస్‌లో విలీనం చేసేశారు. దీనికి సంబంధించి స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి లేఖ కూడా ఇచ్చారు. కాబ‌ట్టి ఇప్పుడు లేని టీడీపీఎల్పీ ప్ర‌స్తావ‌నే అన‌వస‌రం. నా రాజీనామా లేక ఎప్పుడో బుట్ట‌దాఖ‌లైంది`` అని బాంబు పేల్చారు.  వాస్త‌వానికి ఎర్ర‌బెల్లి విలీన ప్ర‌తిపాద‌న‌కు చాలా నెల‌ల కింద‌టే త‌ల‌సాని రాజీనామా చేశారు.  ప్ర‌స్తుతం టీడీఎల్పీ ఇంకా కొన‌సాగుతోంది. కాబ‌ట్టి త‌ల‌సాని వ్యాఖ్య‌లు నిజ‌మ‌య్యే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు.
Tags:    

Similar News