పుర్రెలతో రైతుల ఆందోళ‌న‌..సినీన‌టుల మ‌ద్ద‌తు

Update: 2017-03-24 12:29 GMT
తీవ్ర కరువు బారిన ప‌డి ఆత్మ‌హ‌త్య‌లే శ‌ర‌ణ్యం అనే రీతిలో ఉన్న త‌మ‌ను ఆదుకోవాల‌ని తమిళనాడు రైతులు దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆందోళనకు దిగారు. పంటలు పండక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సమాధుల నుంచి తీసుకొచ్చిన పుర్రెలను పట్టుకుని ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద నిరసన తెలిపారు. కేంద్రం రూ.40వేల కోట్లతో కరువు సహాయక ప్యాకేజీని ప్రకటించాలని, పండించిన పంటకు మద్దతు ధర ఇప్పిస్తామని హామీ ఇవ్వాలని తంజావూర్ - తిరుచిరపల్లికి చెందిన అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈ నెల 14 నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు తీర్చేవరకు దీన్ని విరమించేది లేదని రైతులు స్పష్టంచేశారు.

కాగా, ఈ రోజు రైతుల‌కు స‌హాయ ప్యాకేజీ కోసం ప్ర‌ముఖ సినీ న‌టులు ప్ర‌కాష్ రాజ్‌, విశాల్ మ‌ద్ద‌తిచ్చారు. నిర‌స‌నలో ఉన్న రైతుల‌తో కూర్చొని  వారి ఆందోళ‌న‌కు సంఘీభావం ప్ర‌క‌టించి అన్న‌దాత‌ల‌కు న్యాయం చేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్ మాట్లాడుతూ త‌మిళ‌నాడులో తీవ్ర క‌రువు ఉండ‌టంతో అనేక మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విషయం స్థానికంగా ఉన్న అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల దృష్టికి తీసుకువెళ్లిన‌ప్ప‌టికీ స్పంద‌న రాలేద‌ని తెలిపారు. అందుకే ఢిల్లీ వేదిక‌గా త‌మ ఆవేద‌న‌ను వినిపించేందుకు అనేక క‌ష్టాల‌కు ఓర్చి వ‌చ్చార‌ని చెప్పారు. మ‌నందరి క‌డుపు నింపే రైత‌న్న‌ల ప‌క్షాన ఉండ‌టం క‌నీస బాధ్య‌త అని ప్ర‌కాశ్ రాజ్ చెప్పారు. రైతుల ఆందోళ‌న‌, త‌మ సంఘీభావంతో అయినా కేంద్ర ప్ర‌భుత్వం స్పందిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

కాగా, గ‌త ఏడాది క‌రువు కార‌ణంగా త‌మిళ‌నాడులో తీవ్ర పంట న‌ష్టం జ‌రిగింది. పంట‌లు పండ‌క‌పోవ‌డం, పండిన పంట‌కు క‌నీస మ‌ద్ద‌త ధ‌ర రాక‌పోవ‌డంతో రైతులు క‌ష్టాల పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌ను ఆదుకోవాలంటూ ప్ర‌భుత్వానికి మొర‌పెట్టుకున్నారు. అయితే త‌మిళ‌నాడులోని రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనిశ్చితుల కార‌ణంగా వారికి న్యాయం జ‌ర‌గ‌లేదు. దీంతో ఢిల్లీ వేదిక‌గా ఈ రూపంలో రైతులు నిర‌స‌న తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News